నాణ్యతలో రాజీ వద్దు
సింథటిక్ ట్రాక్ పనులు గడువులోపే పూర్తి చేయాలి
యువతకు ఆధునిక క్రీడా సౌకర్యాలు
సర్దార్ పటేల్ స్టేడియం క్రీడా హబ్‌గా అభివృద్ధి
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్మాణంలో ఉన్న సింథటిక్ రన్నింగ్ ట్రాక్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. పనుల్లో ఎక్కడా నాణ్యత లోపాలు ఉండరాదని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణాలు జరగాలని స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, నగర మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రూ.8 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సింథటిక్ రన్నింగ్ ట్రాక్ పనుల పురోగతిని సమీక్షించారు. అలాగే రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన టేబుల్ టెన్నిస్ హాల్‌ను సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు.
నాణ్యతతో పనులు జరగాలి
పరిశీలన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ట్రాక్ లెవెలింగ్, ఫెన్సింగ్, బాండింగ్, లైన్ మార్కింగ్ పనులు ఐఎస్ఓ ప్రమాణాల ప్రకారం జరగాలని ఆదేశించారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, కార్బోచాంబర్లు నిర్మించాలని సూచించారు. స్టేడియంలో సరిపడా వెలుతురు ఉండేలా హైమాస్ట్ లైట్లు అమర్చాలని, పరిసరాల్లో పచ్చదనం పెంచేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలని తెలిపారు. నిర్మాణ పనులు వేగంగా సాగాలని, నిర్ణీత సమయానికి పూర్తయ్యేలా రోజువారీ పర్యవేక్షణ ఉండాలని అధికారులను హెచ్చరించారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సదుపాయాలన్నీ పకడ్బందీగా ఏర్పాటు చేయాలని సూచించారు.
యువతకు గొప్ప అవకాశం
ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ యువతను క్రీడల వైపు ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఖమ్మం జిల్లాను క్రీడా రంగంలో ముందంజలో నిలపాలనే ఉద్దేశంతో సర్దార్ పటేల్ స్టేడియాన్ని ఆధునిక క్రీడా హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సింథటిక్ రన్నింగ్ ట్రాక్ అందుబాటులోకి వస్తే జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింత ప్రతిభ కనబర్చే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. స్టేడియంలో ఉన్న టేబుల్ టెన్నిస్ హాల్, రన్నింగ్ ట్రాక్ తదితర సదుపాయాలను యువత, విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
నిర్వహణకూ ప్రత్యేక ప్రణాళిక
నిర్మాణం పూర్తయిన తర్వాత నిర్వహణ కూడా అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. సింథటిక్ ట్రాక్‌ను దీర్ఘకాలం ఉపయోగించుకునేలా ప్రత్యేక నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని అన్నారు. ప్రతిరోజూ కొంత సమయం క్రీడలకు కేటాయించుకోవాలని విద్యార్థులు, యువతకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి రావాలని, అందుకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం నగరంలో క్రీడల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, స్టేడియం అభివృద్ధికి కావాల్సిన ప్రతిపాదనలు తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి టి.సునీల్ రెడ్డి, మున్సిపల్ ఎస్ఈ రంజిత్, ఈఈ కృష్ణలాల్, డీఈ నవీన్, ఉద్యానవన అధికారిణి రాధిక, క్రీడాకారులు, కోచ్‌లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


