యూరియా అవసరానికి మించి కొనొద్దు
జిల్లాలో 13,180 మెట్రిక్ టన్నుల స్టాక్ సిద్ధం
ప్రతి రైతుకూ యూరియా అందేలా చర్యలు
మొక్కజొన్న పంట సాగు మండలాలకు ప్రత్యేక ఏర్పాట్లు
ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
పోలీస్ కమిషనర్‌తో కలిసి కొణిజెర్లలో యూరియా కేంద్రాల తనిఖీ
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సాగు చేస్తున్న ప్రతి రైతుకు యూరియా అందేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. కొణిజెర్ల మండలం కొణిజెర్ల, గోపవరం సహకార పరపతి సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన యూరియా విక్రయ కేంద్రాన్ని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. యూరియా కొనుగోలు ప్రక్రియ, క్యూల నిర్వహణ, కూపన్ల జారీ విధానాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో యూరియా కేంద్రాలను పరిశీలిస్తూ రైతుల్లో ఉన్న అనవసర ఆందోళనను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం మొత్తం 13,180 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. ఇందులో మార్క్‌ఫెడ్ వద్ద 8,822 మెట్రిక్ టన్నులు, ప్యాక్స్ వద్ద 917 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల వద్ద 944 మెట్రిక్ టన్నులు, గత నిల్వలుగా 2,495 మెట్రిక్ టన్నులు ఉన్నాయని వివరించారు.
మొక్కజొన్న పంట సాగు మండలాలకు ప్రత్యేక ఏర్పాట్లు
మొక్కజొన్న సాగు అధికంగా ఉన్న కొణిజెర్ల, చింతకాని, బోనకల్, ముదిగొండ మండలాల్లో యూరియా అవసరం ఎక్కువగా ఉంటుందని, అందుకే అక్కడ అదనంగా సేల్ పాయింట్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ప్రతి 2,000 ఎకరాల సాగు విస్తీర్ణానికి ఒక యూరియా సేల్ పాయింట్ ఉండేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. కొణిజెర్ల మండలంలో ఇప్పటికే ఉన్న 7 సేల్ పాయింట్లకు తోడు మరో 9 కొత్త సేల్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
అధిక వినియోగంతో పంటకే నష్టం
యూరియా కోసం రైతులు ఏ సమయంలో రావాలో ముందుగానే సమాచారం ఇస్తూ కూపన్లు జారీ చేస్తున్నామని, కాబట్టి రైతులు సూచించిన సమయానికి వచ్చి యూరియా తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఒకే రైతు తన సాగు విస్తీర్ణానికి అవసరమైన దానికంటే ఎక్కువగా యూరియా తీసుకోరాదని హెచ్చరించారు. అధికంగా యూరియా వాడటం వల్ల పంటకు కూడా నష్టం జరుగుతుందని చెప్పారు. భవిష్యత్తులో దొరకదన్న అనుమానంతో నిల్వ చేసుకుంటే యూరియా నాణ్యత తగ్గి పంట నష్టానికి దారి తీయవచ్చని పేర్కొన్నారు. పర్యటనలో జిల్లా వ్యవసాయ అధికారి డి. పుల్లయ్య, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ ఎం. అపూర్వ, ఏడీఏ కరుణశ్రీ, మండల వ్యవసాయ అధికారి బాలాజీ, కొణిజెర్ల తహసీల్దార్ అరుణ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


