పెళ్లైన 24 గంటల్లోనే విడాకులు!
మూడుేళ్ల ప్రేమ.. ఒక్కరోజులో ముగింపు
నివాసం, జీవనశైలిపై తలెత్తిన విభేదాలు
హింస, ఆరోపణలు లేవు.. పరస్పర అంగీకారమే
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఘటన
కాకతీయ, పుణే : మహారాష్ట్రలోని పుణేలో ఓ నూతన దంపతుల వ్యవహారం పెళ్లి వ్యవస్థపై చర్చకు తెరలేపింది. మూడేళ్ల ప్రేమ తర్వాత పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్న జంట.. పెళ్లైన 24 గంటల్లోనే చట్టబద్ధంగా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. ఈ ఘటన స్థానికంగా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారి తీసింది. వృత్తిరీత్యా యువతి డాక్టర్ కాగా, యువకుడు ఇంజినీర్. పెళ్లికి ముందు మూడేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంటకు వివాహానంతరం జీవన విధానం విషయంలో తీవ్ర అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ముఖ్యంగా ఎక్కడ నివసించాలి? ఉద్యోగ జీవితం ఎలా కొనసాగాలి? అనే అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో విడిపోవడమే సరైన నిర్ణయమని భావించినట్లు తెలుస్తోంది.
పెళ్లి తర్వాతే వెలుగులోకి వచ్చిన నిజం
పెళ్లి అనంతరం యువకుడు తన భార్యకు కీలక విషయాన్ని వెల్లడించాడు. తాను షిప్‌లో పనిచేస్తానని, ఎప్పుడు పోస్టింగ్ వస్తుందో, ఎంతకాలం ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుందో చెప్పలేనని వివరించాడు. ఈ అంశం యువతికి ఆమోదయోగ్యంగా లేకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగాయి. ఈ పరిస్థితుల్లో కలిసి జీవించడం కష్టమని భావించి పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ కేసును వాదించిన అడ్వకేట్ రాణి సోనవానే మాట్లాడుతూ.. ఈ జంట మధ్య ఎలాంటి గృహహింస, క్రిమినల్ ఆరోపణలు లేవని స్పష్టం చేశారు. పూర్తిగా చట్టపరమైన ప్రక్రియను అనుసరించి పరస్పర అంగీకారంతో వివాహ బంధాన్ని రద్దు చేసుకున్నారని తెలిపారు. సాధారణంగా భారత్‌లో విడాకుల కేసులు నెలల తరబడి, కొన్నిసార్లు ఏళ్లపాటు కోర్టుల్లో నడుస్తాయని, అయితే ఈ కేసు అత్యంత వేగంగా పరిష్కారం కావడం ఆశ్చర్యకరమన్నారు. పెళ్లి వ్యవస్థలో ముందస్తు అవగాహన, జీవన లక్ష్యాలపై స్పష్టత ఎంత కీలకమో ఈ ఘటన మరోసారి రుజువు చేస్తోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.


