ఆలేరులో రంజాన్ తోఫా కిట్ల పంపిణీ..!
కాకతీయ, ఆలేరు : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని వై ఎస్ ఎన్ గార్డెన్స్‌లో బీర్ల ఫౌండేషన్, ఎన్ ఎస్ ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి ముఖ్య అతిథులుగా హాజరై ముస్లిం సోదరులకు కిట్లు అందజేశారు. కార్యక్రమంలో బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత, ఎన్ ఎస్ ఐ ఫౌండేషన్ చైర్మన్ నవాబ్ ఇబ్రహీం షేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండ్రు శోభారాణి మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన సమయమని తెలిపారు. ఈ మాసంలో ఉపవాసాలు, ప్రార్థనలు చేసి అల్లా కృప కోసం ప్రార్థిస్తారని అన్నారు. ఆలేరు ప్రాంతానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన నవాబ్ ఇబ్రహీం షేక్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణలో అన్ని మతాల ప్రజలు సౌభ్రాతృత్వంతో జీవించడం గర్వకారణమన్నారు. ముస్లిం సోదరుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. రంజాన్ పండుగ ప్రేమ, శాంతి, సేవాభావాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ముస్లిం సోదరులు, మహిళలు పాల్గొన్నారు.


