సెక్యూరిటీ సిబ్బందికి క్రమశిక్షణ ముఖ్యం
సెక్యూరిటీ జిఎం చందా లక్ష్మీనారాయణ
కాకతీయ, కొత్తగూడెం: సెక్యూరిటీ సిబ్బందికి క్రమశిక్షణ అనేది ముఖ్యమని సింగరేణి జనరల్ మేనేజర్ (సెక్యూరిటీ)చందా లక్ష్మినారాయణ అన్నారు.
సింగరేణి వ్యాప్తంగా ఎస్ అండ్ పిసి జమేదార్లకు విడతల వారీగా నిర్వహించే పునశ్చరణ శిక్షణా తరగతులలో భాగంగా ఈనెల 17వ తేదీ నుండి 22వ తేదీ వరకు కొత్తగూడెం ఎస్ అండ్ పిసి ట్రైనింగ్ సెంటర్ నందు నిర్వహించే 13వ జమేదార్ల పున:శ్చరణ శిక్షణా తరగతుల ప్రారంభోత్సవానికి సోమవారం జనరల్ మేనేజర్(సెక్యూరిటీ) చందా లక్ష్మినారాయణ హాజరై మాట్లాడుతూ సెక్యూరిటీ సిబ్బంది అందరికీ క్రమశిక్షణ అనేది ముఖ్యం అని క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్నపుడే మనకు గుర్తింపు వస్తుందని జమేదార్లు ఫ్రంట్ లైన్ సూపర్ వైజర్ గా కీలకపాత్ర పోషిస్తారని ఎస్ అండ్ పిసి ప్రధాన విధులలో సెక్యూరిటీ సిబ్బంది రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించి వారిని సమన్వయంతో విధులను సమర్ధవంతంగా నిర్వహించేందుకు మార్గదర్శకత్వం వహించాలని పేర్కొన్నారు.
ఎస్ అండ్ పిసి విభాగం పటిష్టంగా ఉండేందుకు కావలసిన అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ట్రైనింగ్ సెంటర్ అభివృద్ధికి అన్ని రకాల సహాయ సహకారాలు యాజమాన్యం అందిస్తుందని సెక్యూరిటీ సిబ్బంది అందరు మెరుగైన వృత్తి నైపుణ్యంతో అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ సింగరేణి ఆస్తులు స్థలాలను పరిరక్షించాలని సూచించారు. సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని తెలిపారు. త్వరలోనే సెక్యూరిటీ సిబ్బంది అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుని సమర్ధవంతంగా విధులు నిర్వహించేందుకు ఫ్యాబ్రికేటేడ్ చెక్ పోస్టులను అన్ని ఏరియాలకు అందిస్తున్నామని నాణ్యమైన యూనిఫాం త్వరలోనే అందుతుందని ఖాళీగా ఉన్న జూనియర్ ఇన్స్ పెక్టర్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం జిఎం(సెక్యూరిటీ) చందా లక్ష్మినారాయణ ఈ నెలాఖరున పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా అన్నీ ఏరియాల నుండి శిక్షణ నిమిత్తం వచ్చిన జమేదార్లు అందరూ ఆయనను శాలువా బొకేతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఇన్ స్పెక్టర్ డి.నారాయణరెడ్డి, ట్రైనింగ్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.



