‘ఆది కర్మయోగి’కి దిల్ రాజు ప్రశంసల జల్లు
కాకతీయ, చర్ల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి చెందిన ఆదివాసీ యువకులు నటించిన ‘ఆది కర్మయోగి’ లఘు చిత్రం రాష్ట్రస్థాయిలో ప్రశంసలు అందుకుంది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ‘బతుకమ్మ యాంగ్ ఫిల్మ్ మేకర్స్ చాలెంజ్’ పోటీల్లో ఈ లఘు చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రవీంద్రభారతిలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు సమక్షంలో బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ‘ఆది కర్మయోగి’ చిత్రాన్ని మంత్రి, దిల్ రాజు ప్రత్యేకంగా ప్రశంసించడం విశేషం.
ఏజెన్సీ గిరిజనుల జీవన వేదన
తెలంగాణ ప్రజా పాలన ప్రారంభమైన తర్వాత అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను నేపథ్యంగా తీసుకుని రూపొందించిన ఈ లఘు చిత్రం, మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాకాలంలో రహదారులు లేని గ్రామాల్లో గిరిజనులు పడే అవస్థలను హృద్యంగా ఆవిష్కరించింది. సహజత్వంతో కూడిన కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ షార్ట్ ఫిలిం పోటీలకు సుమారు 550 లఘు చిత్రాలు పోటీ పడగా, ‘ఆది కర్మయోగి’ ప్రైజ్ మనీ దక్కించుకోలేకపోయినా, రాష్ట్రస్థాయిలో ప్రశంసలు అందుకోవడం చర్ల ఆదివాసీ యువతకు గర్వకారణంగా నిలిచింది. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి ఆదివాసీ యువకులు నటనతో గుర్తింపు పొందడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ లఘు చిత్రంలో చర్ల మండలానికి చెందిన ఆదివాసీ యువకులు కోర్సా శివప్రసాద్, కారం వైష్ణవి, మడివి మహేష్, తెల్లం కవిత, మీడియం అర్జున్, మునగల నానాజీ, దుబ్బ వినోద్, కుంజ అశోక్లు నటించి మెప్పించారు.
జి. లక్ష్మణ్ కుమార్ దర్శకత్వం వహించగా, సరవణన్ నిర్మాతగా వ్యవహరించారు. సాగర్ పర్యవేక్షణలో చిత్రం రూపుదిద్దుకుంది. ఏజెన్సీ ప్రాంతాల గిరిజనుల గొంతుకగా నిలిచిన ‘ఆది కర్మయోగి’ లఘు చిత్రం రాష్ట్రస్థాయిలో ప్రశంసలు అందుకోవడం ఆనందదాయకమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


