అనధికార ఇసుక ర్యాంపే ప్రాణాలు తీసిందా?
పాపం మొత్తం అధికార యంత్రాంగానిదే
సాయం చేయబోయి ప్రాణాలు కోల్పోయిన గిరిజన యువకుడు
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : అనధికారికంగా ఏర్పాటు చేసిన ఇసుక ర్యాంపు ఒక గిరిజన కుటుంబంలో చీకట్లు నింపింది. సాయం కోసం వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినా అధికారులు స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. లక్ష్మీదేవిపల్లి మండలం సాటివారిగూడెం గ్రామానికి చెందిన వీ సాల వెంకటేశ్వర్లు (42) ఆదివారం ఉదయం ముర్రేడు వాగులో ఇసుక కోసం వెళ్లిన ఎడ్లబండి నీటమునిగిన విషయం తెలుసుకుని సహాయం చేసేందుకు వెళ్లాడు. సమీప సర్పంచ్‌కు చెందిన బండి కావడంతో మానవత్వంతో ముందుకొచ్చి ఎడ్లను, బండిని బయటకు తీశాడు. అయితే తాను వదిలిన బట్టలు తీసుకురావడానికి తిరిగి వాగు దాటే ప్రయత్నంలో సుడిగుండంలో చిక్కుకుని మునిగిపోయాడు. గ్రామస్తులు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే వెంకటేశ్వర్లు ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరు పిల్లలున్న ఈ కుటుంబానికి పెద్దదిక్కు కోల్పోయినట్లయింది. లక్షల ఆదాయం వస్తున్నా అనధికార ఇసుక ర్యాంపుపై రెవెన్యూ, పోలీసు శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. ఒక నిండు ప్రాణం పోయినా అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాపానికి ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని గ్రామస్తులు నిలదీస్తున్నారు.


