తిరుగువారం జాతరకు పోటెత్తిన భక్తజనం
మేడారం జాతరకు లక్షలాదిగా భక్తులు
వనదేవతల సన్నిధిలో భక్తి పారవశ్యం
కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా ప్రసిద్ధిగాంచిన శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో తిరుగువారం వేళ వనదేవతల సన్నిధి భక్తజన సంద్రంగా మారింది. బుధవారం ఉదయం నుంచే తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు మేడారం బాట పట్టారు. జాతర ముగింపు దశకు చేరుకున్నప్పటికీ భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. భక్తులు ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. బంగారం (బెల్లం), ఓడిబియ్యం, కొబ్బరికాయలు సమర్పిస్తూ అమ్మవార్లకు తమ భక్తిని చాటుకున్నారు. గద్దెల పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడగా, ఎటుచూసినా “జై సమ్మక్క–జై సారలమ్మ” నినాదాలతో మార్మోగాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తాగునీటి సదుపాయం, వైద్య సేవలు, రవాణా సౌకర్యాలు, భద్రతా చర్యలను పకడ్బందీగా అమలు చేశారు. పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తూ భక్తులు సురక్షితంగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుంది. జాతర ప్రాంగణంలో పరిశుభ్రతకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. పేరుకుపోయిన చెత్తను పారిశుధ్య కార్మికులు ఎప్పటికప్పుడు తొలగిస్తూ, వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్య శిబిరాలు, అంబులెన్సులు అందుబాటులో ఉంచారు. తిరుగువారం సందర్భంగా కన్నేపల్లి ఆలయంలో వనదేవతల పూజారులు సంప్రదాయబద్ధంగా శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. దీప, ధూప, నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి, అనంతరం అమ్మవార్ల పూజా సామగ్రి, పట్టు వస్త్రాలను భద్రపరిచే ఆచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమాలు భక్తుల సమక్షంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. జాతర చివరి రోజున కూడా భక్తుల రాక కొనసాగుతుండటంతో మేడారం ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. భక్తులు క్రమశిక్షణతో దర్శనాలు చేసుకుని సురక్షితంగా స్వస్థలాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. తిరుగువారంతో జాతర ఘట్టాలు ముగింపుదశకు చేరుకున్నా, భక్తి పరవశం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.



