వేములవాడలో భక్తులకు నిరాశ
రాజన్న దర్శనాలు ఒక్కసారిగా నిలిపివేతపై ఆగ్రహం
కాకతీయ, వేములవాడ : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం భక్తులకు పెద్ద షాక్ తగిలింది. ముందస్తు సమాచారం లేకుండానే ఆలయ అధికారులు స్వామివారి దర్శనాలను నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తెల్లవారుజామున నుంచే స్వామివారి దర్శనం కోసం పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను అధికారులు ఆలయ ప్రధాన గేటు వద్దే ఆపేశారు. గేటుకు తాళం వేసి, రేకులు ఏర్పాటు చేయడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తూ ఆలయ ద్వారాల ఎదుట ఆందోళనకు దిగారు.అయితే ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో రాజరాజేశ్వర స్వామివారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు. భక్తుల సౌలభ్యార్థం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్‌ల ద్వారా స్వామివారి దర్శనాన్ని కల్పించారు.ఎంతో దూరం నుంచి కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు చెల్లించాలనుకున్న భక్తులు దర్శనం లేకపోవడంతో నిరాశ వ్యక్తం చేశారు.ముందస్తుగా ప్రకటించి ఉంటే ఇంత ఇబ్బంది పడేవాళ్లం కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.


