ప్రజల సహకారంతోనే అభివృద్ధి పనులు
నాణ్యతతో వసతి గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి
ప్రతీ ఇంటికి శుద్ధమైన త్రాగునీరు సరఫరా లక్ష్యం
నగరంలో తాగునీటి పనులకు రూ.220 కోట్లు మంజూరు
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
ముస్తఫానగర్ బీసీ బాలుర వసతి గృహ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం నగరంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. మంత్రి శుక్రవారం స్థానిక ముస్తఫానగర్ లో రూ.3 కోట్లతో నిర్మించనున్న బీసీ బాలుర వసతి గృహ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం నగరంలో పాతబడి కూలిపోయే స్థితిలో ఉన్న మూడు సంక్షేమ హాస్టల్స్ నిర్మాణానికి ప్రభుత్వం మొత్తం 9 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. ఈ హాస్టళ్ల నిర్మాణ పనులు పూర్తి నాణ్యతతో చేపట్టాలని, భవిష్యత్తులో పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజల అంగీకారం ఉంటే బోనకల్ రోడ్డు వెడల్పు చేస్తామని అన్నారు. రోడ్డు వెడల్పు జరిగితేనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. ఖమ్మం నగరంలో ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, త్వరలో తాగునీటి సౌకర్యం కల్పన కోసం మరో రూ.220 కోట్లు మంజూరు చేస్తామని అన్నారు. రాబోయే వేసవిలో ఖమ్మంలో మంచినీటి సమస్య ఉండటానికి వీలు లేదని, ప్రతీ ఒక్కరికి శుద్ధమైన తాగు నీరు అందాలని అన్నారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు, స్వామి నారాయణ స్కూల్ కూడా త్వరలో రాబోతున్నాయని అన్నారు. పేద విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి గురుకులాల్లో డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచడం జరిగిందని అన్నారు.
ప్రజలు సహకరించాలి..
నగరంలో రోడ్డు విస్తరణ పనులకు ప్రజలు సహకరించాలని, పావలా నష్టపోతే ప్రజలకు రూపాయి వరకు పరిహారం అందించి ఆదుకుంటున్నామని మంత్రి తెలిపారు. రైల్వే స్టేషన్ రోడ్డు వెడల్పు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. కార్పొరేటర్లు తమ డివిజన్ పరిధిలో వెడల్పు చేయాల్సిన రోడ్ల వివరాలు అందించాలని అన్నారు. భవిష్యత్తులో కూడా ఖమ్మం నగరం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, స్థానిక కార్పొరేటర్ రోజ్ లీనా, కార్పొరేటర్లు, జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి జి.జ్యోతి, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, ఈఈలు రంజిత్, కృష్ణలాల్, మునిసిపల్ కార్పొరేషన్ సహాయ కమిషనర్ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


