- బీటీపీఎస్ నిధులను నిర్వాసిత గ్రామాల పురోగతికి ఉపయోగించాలి
- సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ మణుగూరు డివిజన్ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి
కాకతీయ, మణుగూరు :బీటీపీఎస్ నిధులను నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి ఉపయోగించాలని, సత్వరమే మౌలిక సమస్యలను పరిష్కరించాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్.మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగట్లో అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లు కోట్లాది రూపాయల బీటీపీఎస్, సీఎస్ఆర్ నిధులు వస్తున్నా.. నిర్వాసిత గ్రామాలలో సరైన మౌలిక సదుపాయాలు లేవని వాపోయారు. ఒకప్పుడు పచ్చని పైరులతో, ప్రశాంత వాతావరణంలో ఉన్న నిర్వాసిత గ్రామాలు నేడు దుమ్ము, ధూళితో దర్శనమిస్తున్నాయన్నారు. వాతావరణ కాలుష్యంతో ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారన్నారు.
నిర్వాసిత గ్రామాల ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నా.. నిర్వాసిత గ్రామాల అభివృద్ధి పట్ల ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్నారు. బీటీపీఎస్, సీఎస్ఆర్ నిధి కింద సుమారు రూ.20 కోట్లు ఇప్పటివరకు చెల్లించారు. కానీ ఈ నిధులు నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి ఉపయోగించకుండా దారి మళ్ళించడం వలన నిర్వాసిత గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. బీటీపీఎస్ నుండి మణుగూరు వరకు రోజు వందలాది బొగ్గు టిప్పర్లు తిరుగుతూ రోడ్డు గుంతల మయంగా మారిందన్నారు. ఇప్పటికే తమ పార్టీ ఆధ్వర్యంలో కరపత్రాలు, గ్రూప్ మీటింగ్స్ ద్వారా నిర్వాసిత గ్రామాలలో సమస్యలపై విస్తృత ప్రచారం నిర్వహించి ఆందోళనకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి, సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమాల్లో నాయకులు కురసం రామకృష్ణ, ఇందారపు వెంకట్ నర్సయ్య, అలవాల సమ్మన్న, పబ్బతి అనిల్, ముషిక లక్ష్మణ్, రావులపల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


