తండ్రికి తలకొరివి పెట్టిన కూతుర్లు
కాకతీయ, మణుగూరు/అశ్వాపురం : మణుగూరు మండలం చింతిర్యాల కాలనీ గ్రామంలో భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. కుమారులు లేని కుటుంబంలో తండ్రి మరణించగా, ఇద్దరు కూతుర్లే స్వయంగా అంత్యక్రియలు నిర్వహించి ఆదర్శంగా నిలిచారు. జక్కుల చంద్రం–శాంతమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తమ్ముడు మరణించడంతో ఆయన కుమార్తెను కూడా చంద్రం చిన్నప్పటి నుంచే పెంచి పెద్ద చేసి వివాహం చేశారు. పేద కుటుంబమైనప్పటికీ కూలీనాలి చేసి ముగ్గురు అమ్మాయిలకు పెళ్లిళ్లు చేశారు. కొంతకాలంగా చంద్రం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఫిబ్రవరి 7న మృతి చెందారు. కుటుంబంలో కుమారులు లేకపోవడంతో అంత్యక్రియలు ఎవరు నిర్వహిస్తారన్న ప్రశ్న ఎదురైంది. ఈ సమయంలో పెద్ద కుమార్తె కరుణ, రెండో కుమార్తె సువార్త, తమ్ముడి కుమార్తె అఖిల ధైర్యంగా ముందుకు వచ్చారు. గ్రామ యువత, పెద్దలు, ఉపసర్పంచ్ సహకారంతో సంప్రదాయబద్ధంగా తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సమాజంలో మారుతున్న ఆలోచనలకు ప్రతీకగా నిలిచిన ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశమైంది. ఆపద్బంధువుల్లా అండగా నిలిచిన గ్రామస్తుల సేవాభావాన్ని కుటుంబ సభ్యులు కృతజ్ఞతతో గుర్తుచేసుకున్నారు.


