దసరా..! దావత్ కా బాప్
సరదాల దసారకు ఈసారి ఎన్నికల హైప్
గ్రామమే కుటుంబంగా మారిపోయే తెలంగాణ పండుగ
ఎన్నికల కోలహాలంతో ఈ సారి గ్రామాల్లో డబుల్ దసరే
కాకతీయ, స్పెషల్: తెలంగాణలో దసరా అంటేనే ధూం ధాం..! దసరా అంటే దావత్.. దావత్ అంటే దసరా.. అన్నట్లుగా ఉంటుంది. మాములుగా పండుగల సమయాల్లో జరిగే దావత్‌లకు.. ఈ పండుగ దావత్ కా బాప్ అన్నమాట. తొమ్మది రోజుల బతుకమ్మ పండుగ తర్వాత వచ్చే విజయ దశమిన జరుపుకునే దసరాకు తెలంగాణలోని ఊళ్లన్నీ కోలాహలంతో నిండిపోతుంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రాదాయాలకు నిదర్శనంగా ఉండే దసరా పండుగరోజున కంచంలో ముక్కా.. నోట్లో సుక్క పడంది అది దసరా ఎట్లావుతుందిరా..?! అంటూ ముసలోళ్లు నిలేసి అడుగుతుంటారు. దసరా రోజున నాలికకు బొక్కకూర రుచి తగలకుంటే..! సారా సుక్క పడకుంటే దాన్ని దసరెందుకు అంటరా బై అంటూ సరదాగా వ్యగ్యకీరిస్తారు. అవుమల్ల.. అందుకే దసరా పండుగ అంటేనే సంతోషం.. సంబురం.. ఏడాదంతా రద్దీని ఒక్క దినం మరించి తాగుతూ..తూగుతూ.. మదినిండా ధైర్యం నింపుకుంటూ కొత్త ఆశలతో జీవితంలో ముందుకు సాగడమే..! దసరా సందేశం అంటారు మరికొందరు. అందుకే దసరా రోజున వేళ్ల మీద లెక్కించగలిగే సామాజిక వర్గాల కుటుంబాలు మినహా ఆ రోజున నీసు అండని ఇల్లు ఉండదంటే అతిశేయోక్తి కాదు.
జమ్మి చెట్టు కాడ అలయ్ బలయ్..
మిగతా ఏ పండుగలకు సొంత ఊరికి రాకుండా పట్నంలోనే ఉండిపోయినా… ఈ పండుగకు మాత్రం రెక్కలు కట్టుకుని వాలిపోతుంటారు. ఎందుకంటే ఈ పండుగకు సరదాలు అలా ఉంటాయి మరి. ఊరే కుటుంబంగా మారి చేసే వేడుక కనుక.. సొంతూరిని ఓ సారి కళ్లారా చూసి వద్దామని వస్తుంటారు. ఫ్రెండ్స్‌తో జరుపుకునే దావత్‌ల మజా మాములుగా ఉండదు మరి. అందుకే దసరాకు నెల రోజుల ముందు నుంచే పార్టీలకు, ప్రయణానికి ప్లానింగ్‌లు జరిగిపోతుంటాయి. ఎక్కడెక్కడో స్థిరపడిపోయిన వాళ్లంతా కూడా దసరా రోజున జమ్మిచెట్టు కాడ ప్రత్యక్ష్యమవుతుంటారు.
మనమంతా ఒకే గ్రామవాసులం అన్న ఫీలింగ్ వారి ముఖాల్లో తొనికిసలాడుతుంది. జమ్మి ఆకు ఒకరికొకరు ఇచ్చుకుంటూ అలయ్ బలయ్ తీసుకుంటూ మనస్పర్థాలను తొలగించుకుంటూ అనుబంధాలను పెనవేసుకుంటుంటారు..! గుమ్మడి కాయ కొట్టేప్పుడు లేకుంటే.. ఆ ఊరి మనిషే కాదన్నట్లుగా చూస్తారు జనాలు. సొంతూరు అన్నందుకు ఊళ్లో ఓటు ఉంచుకునుడు కాదు..దసరాకు హాజరు పడాల్సిందేనన్నమాట. జమ్మిచెట్టు కాడ కనబడుడే వచ్చిండు అన్నదానికి రుజువన్నమాట.అందుకే గ్రామమంతా కుటుంబంగా మారే ఈ పండుగలో హైదరాబాద్‌లో ఉన్నా.. అమెరికాలో ఉన్నా రెక్కలు కట్టుకుని వాలిపోతుంటారు. దసరా పండుగలో దొరికే కిక్కు అట్లుంటది మరి.
ఈసారి డబుల్ దసరే..!
మాములుగానే.. మాములుగా ఉండదు దసరా.. మరి ఈసారి ఎన్నికల పండుగ కూడా జతైంది కాబట్టి డబుల్ దసరాకు ఊళ్లల్లో జనం సిద్ధమయ్యారు. బాపూ..నేనున్నా..అన్నా.. అక్కా నేను నిలబడుతున్నానంటూ కాళ్లు, చేతులు, గడ్డం గదువ, కడుపుతో తలకాయ పెడుతూ ఆశవహులు ఇప్పటికే కనబడ్డ ఓటర్లను పలకరిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో పట్నంలో ఉన్న వారికి సైతం పనిగట్టుకుని ఫోన్ చేసి.. బావా కూరచెప్పినా.. కళ్లు ఒక్క గొలదే.. ఆర్మీమందు నీకోసం దాచి పెట్టి ఉంచినా.. ఫారిన్ లిక్కర్‌కూడా తెప్పిచ్చిపెట్టి ఉంచినా.. నీ రాక ఆలస్యం.. అచ్చిదంటే షూరువు చేద్దాం.. ఎప్పుడు బయల్దేరుతానవు అంటూ దావత్ ఆఫర్లు చేసేస్తున్నారు. అక్కను, కోడలు, అల్లుడిని కూడా తీసుకునిరా.. అంటూ మర్యాద ముచ్చట్లతో ఫోన్లుకొడుతున్నరు.
ఈ లెక్కన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల హైప్ ఎట్లుందో సూసుకోర్రి..! ఊళ్లకు పోయే పట్నమేల్లు.. పట్నం నుంచి వచ్చే వారి కోసం పల్లెల్లోని జనాలు కాస్త రెండు మూడు రోజులు దాకా ఆలోడి కూడా ఉండేందుకే ప్లాన్ చేసుకున్నంటున్నారు. పండుగలో..పనిగా.. ఎలక్షన్లలో ఎవరెవరు నిలబడుతున్నారు.. ఎవరెల్ల చేరిక అవుతుందన్న ముచ్చట్లన్నీ కూడా చెవిలో వేసుకుని మళ్లీ పట్నం పోయేందుకు జనాలు సిద్ధమవుతున్నారు.
గాంధీ జయంతి సందర్భంగా వైన్ షాపులు బంద్ ప్రకటించడంతో.. జనాలంతా మందుచూపుతో ముందుగానే కొనుగోలు చేసుకుంటున్నరు.. మరి మీ సంగేతేందో జర చూసుకోండ్రి..!!

కాకతీయ ఎడిటర్
అరెల్లి కిరణ్ గౌడ్
7396604266


