కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఆన్లైన్ లో డబ్బులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేసిన కేసులో ఒకరిని ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసినట్లు సి.పి. సునిల్ దత్ తెలిపారు. కేసు వివరాలలోకి వెళితే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలానికి చెందిన ఓ సివిల్ ఇంజనీర్ కు ఫోన్ చేసి ఆన్లైన్ లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని ఆశచూపారు. కాగా అతడు వాట్సప్, ట్రేడింగ్ లింకుల ద్వారా సుమారు రూ.11 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయాడు.
ఈ కేసులో రూ.2లక్షలు అకౌంటుకు వెళ్ళిన అకౌంట్ హోల్డర్ లక్కీరెడ్డి హరిప్రసాద్ రెడ్డిని రంగారెడ్డి జిల్లా మణికొండ లో అరెస్టు చేశారు. అనంతరం ఖమ్మం సైబర్ క్రైం కోర్టులో హాజరు పరిచి, రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణలో ముఖ్య పాత్ర వహించిన సైబర్ క్రైమ్ డి.ఎస్పీ, సి.ఎచ్.ఆర్.వి. ఫణిందర్ ని, టాస్క్ లో పాల్గొన్న ఎస్సైలు రంజిత్ కుమార్, విజయకుమార్, కానిస్టేబుల్స్ కృష్ణారావు, కిషన్ రావును, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఖమ్మం సీపీ అభినందించారు.


