- అప్రమత్తతతోనే సైబర్ నేరాల నియంత్రణ
- అవగాహనతోనే మోసాలకు చెక్ పెట్టగలం
- విద్యావంతులే అధికంగా మోసపోతుండడం బాధాకరం
- అవగాహన కార్యక్రమాల్లో పోలీసు అధికారులు
- ఖమ్మం జిల్లాలో ఘనంగా సైబర్ జాగృక్త దివాస్
- సైబర్ నేరాలపై యుద్ధం ప్రకటించిన ఖమ్మం పోలీస్
- పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన కార్యక్రమాలు
- సీపీ ఆదేశానుసారం అవగాహన సదస్సు లు : సైబర్ సెల్ డీఎస్పీ ఫణిందర్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : అప్రమత్తతోనే సైబర్ నేరాలను నియంత్రించగలమని ఖమ్మం జిల్లా సైబర్ క్రైం డీఎస్పీ ఫణిందర్ తెలిపారు. అవగాహనతోనే సైబర్ మోసాల నుంచి తప్పించుకోగలమని అన్నారు. అందుకే సైబర్ నేరాల తీరుపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండటం మచిందని అన్నారు. విద్యావంతులే సైబర్ మోసాల బారిన పడుతుండటం బాధాకరమని అన్నారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని తెలిపారు. గురువారం ఖమ్మం జిల్లాలో సీపీ సునిల్ దత్ ఆదేశాల మేరకు సైబర్ జాగృక్త దివాస్‌ను ఆయా స్టేషన్లలో నిర్వహించినట్లు సైబర్ క్రైం డీఎస్పీ ఫణిందర్ తెలిపారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ సునిల్ దత్ ఆదేశాల మేరకు గురువారం కమిషనరేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
సైబర్ స్టేషన్, ఖానాపురం హావేలి స్టేషన్, రఘునాథపాలెం స్టేషన్, వన్ టౌన్ పరిధిలోని పాత బస్టాండ్, టూ టౌన్ పరిధిలోని సర్దార్ పటేల్ స్టేడియం, తిరుమలాయపాలెం మండలం సుబ్లేడ్ పాఠశాలలో సైబర్ నేరాలపై ప్రజలకు, విద్యార్థులకు, క్రీడాకారులకు, యువతకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్, ఖమ్మం వన్ టౌన్ సీఐ కరుణాకర్, ఖానాపురం హావేలి పోలీస్ స్టేషన్ సీఐ భానుప్రకాష్, ఖమ్మం టూ టౌన్ ఎస్‌ఐ రమేష్, తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్‌లు ఆయా కార్యక్రమాల్లో మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో పాటు సైబర్ నేరాలు ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. సైబర్ నేరాల్లో విద్యావంతులే అధికంగా మోసపోతుండడం బాధాకరమన్నారు. మల్టీలెవల్ మార్కెటింగ్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్, ఇతర ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.
డబ్బులు అడిగితే అనుమానించండి
ఏ పోలీస్ అధికారి నేరుగా వాట్సప్ వీడియోకాల్స్ చేయరని, డిజిటల్ అరెస్టులు అని ఎవరైనా కాల్స్ చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లో వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజల బలహీనతలే సైబర్ నేరగాళ్లకు బలంగా మారిందన్నారు. మారుతున్న టెక్నాలజీతో మోసగాళ్లు చెలరేగిపోతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో వచ్చే లింక్‌లు ఓపెన్ చేయొద్దని అన్నారు. అప్రమత్తంగా ఉంటేనే నష్టం జరగదన్నారు.సైబర్ నేరగాళ్ల చేతిలో నష్టపోతే తక్షణమే 1930లో ఫిర్యాదు చేయాలన్నారు. ముఖ్యంగా ‘ఉచితం’ లేదా ‘ఉత్తమ ఆఫర్లు’ వెనుక దాగి ఉన్న మోసాన్ని గుర్తించాలని ఖమ్మం వన్ టౌన్ పోలీసులు ఖమ్మం బస్ స్టాండ్ లో ప్రయాణికులకు సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరగాళ్లు ప్రతిరోజూ కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు ప్రజల భద్రతకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వ్యక్తిగత అప్రమత్తత చాలా అవసరమని తెలిపారు. లాటరీ లేదా పెద్ద మొత్తంలో డబ్బు గెలుచుకున్నారని చెప్పే నకిలీ ఆఫర్లను నమ్మవద్దని, ఇలాంటి వాటి వెనుక వ్యక్తిగత సమాచారం లేదా డబ్బు కాజేసే ఉద్దేశమే ఉంటుందన్నారు. “మేము సీబీఐ లేదా పోలీసులము మాట్లాడుతున్నాం” అని చెప్పే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసుల డీపీ పెట్టుకుని వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు.


