ఆకర్షణీయ ప్రకటనలతో సైబర్ మోసాలు
పోలీస్ కమిషనర్ సునీల్ దత్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: సైబర్ మోసగాళ్లు పాల్పడే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. కొత్త కంపెనీ లేదా ప్రసిద్ధ సంస్థ పేరు మీద ఐపీఓ వస్తుందంటూ…తక్కువ ధరలో షేర్లు అందుబాటులో ఉన్నాయని, త్వరగా షేర్లు తీసుకుంటే ఎక్కువ లాభం వస్తుంది అంటూ సోషల్ మీడియా ద్వారా లింక్ పంపుతూ.. మోసపూరిత వాగ్దానాలతో డబ్బు బదిలీ చేయించుకుని మోసం చేశారని పలు ఫిర్యాదులు వస్తున్నాయని సీపీ అన్నారు. నకిలీ ట్రేడింగ్ ప్లాట్ ఫాం మోసం తక్కువ పెట్టుబడితో లాభాలు వస్తాయని సోషల్ మీడియా ద్వారా “రోజుకు వేలల్లో లాభం”, “100% రిటర్న్” అంటూ ప్రకటనలు చేస్తారని సూచించారు. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టగానే కొంత లాభం చూపించి నమ్మకం కలిగిస్తారు. ఆ తరువాత పెద్ద పెట్టుబడి పెట్టమని ప్రోత్సహిస్తారు. విత్ డ్రా చేయాలంటే “ట్యాక్స్”, “సర్వీస్ చార్జ్” పేరుతో డబ్బు అడుగుతారు. చివరికి వెబ్ సైట్ లేదా యాప్ యాక్సెస్ నిలిపివేసి, డబ్బుతో మాయమవుతారని తెలిపారు. గ్యారంటీడ్ రిటర్న్స్, డబుల్ మనీ అని చెప్పేవారిని నమ్మవద్దని సూచించారు. ఎవరైనా వీడియో కాల్, వాట్సాప్ లేదా మెసేజ్ ద్వారా పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేస్తే వెంటనే కాల్ కట్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.
స్పెషల్ లోక్ అదాలత్ ద్వారా 5838 కేసులు పరిస్కారం
జిల్లావ్యాప్తంగా ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా 5838 కేసులు పరిష్కారమయ్యాయని, సైబర్ క్రైమ్ కేసుల్లో 92 లక్షలకు పైగా రిఫండ్ మొత్తాన్ని బాధితులకు అందజేశారని పోలీస్ కమిషనర్ తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా రాజీకి అవకాశం ఉండి పరిష్కరించిన 5838 కేసుల్లో ఎఫ్ఐఆర్ కేసులు -605, ఈ పెటీ కేసులు -2583, డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులు – 2650, సైబర్ కేసులు -195 పరిష్కరించడం ద్వారా 92,45,636/- రూపాయలు బాధితులకు అందజేశారని తెలిపారు. లోక్ అదాలత్ సద్వినియోగానికి సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, న్యాయసేవాధికారులకు సీపీ కృతజ్ఞతలు తెలిపారు.


