
ఉత్సవాలతో పర్యాటక శోభ
విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు
గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన డప్పు కళాకారులు
కాకతీయ,అమరావతి: సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుని భావితరాలకు అందివ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడలో గత 11 రోజుల నుంచి విజయవాడ ఉత్సవ్ పేరుతో జరుగుతున్న వివిధ కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. దసరా వేడుకల్లో భాగంగా చేపట్టిన సాంస్కృతిక సంబరాల్లో భాగంగా ఇందిరా గాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకూ సాంస్కృతిక కవాతు నిర్వహించారు. ఈ కవాతును ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 3 వేల మందితో వివిధ కళా రూపాలు, నృత్యాలతో భారీ ఎత్తున కవాతు జరిగింది. డప్పు కళాకారుల ప్రదర్శనకు గిన్నిస్ బుక్ రికార్డు దక్కింది. అనంతరం గొల్లపూడి ఎక్స్ పో గ్రౌండ్సులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఎక్స్ పోలో ఏర్పాటు చేసిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సుతో కూడిన రోబో కిచెన్ విశేషాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…”సంక్షేమం, అభివృద్ధి అవసరం… అదే సమయంలో మానసిక ఆనందం కూడా అవసరమే. మన సంస్కృతీ సంప్రదాయాలు కాపాడుకోవాలి. మానసికంగా ప్రజలకు ఉల్లాసం ఉండాలి. నృత్య రీతులు, సంగీతం, సాహిత్యం, కళలు అన్నీ మన సంస్కృతిలో భాగం. కనుమరుగవుతున్న ఇలాంటి కళల్ని కాపాడుకోవాలి. వారసత్వంగా వచ్చిన ఈ కళలను భావితరాలకు అందివ్వాలి. విజయవాడ ఉత్సవ్ లో భాగంగా 280కి పైగా ఈవెంట్లను నిర్వహించారు. 2.50 లక్షల మంది వీటిని వీక్షించారు. హెలీ రైడింగ్ సహా వేర్వేరు సాహస క్రీడల్ని కూడా నిర్వహించి విజయవాడ ఉత్సవ్ ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.” అని సీఎం అన్నారు.

ఆలయాలే మన సంపద
“దుర్గమ్మ ఆశీస్సులు… కృష్ణమ్మ కరుణ విజయవాడకు ఉంది. మూడేళ్లలో ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు మళ్లీ ఇక్కడే స్థిరపడడానికి వెనక్కి వస్తారు. విజయవాడ ఉత్సవ్ తో నగరంలో నూతన ఉత్సాహం కన్పిస్తోంది. ఎంజీ రోడ్డులో సాంస్కృతిక కవాతు నిర్వహించారు. డప్పు కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొని గిన్నీస్ వరల్డ్ రికార్డును సాధించారు. గరగలు, కొమ్ముకోయ, తప్పెటగుళ్లు, కర్రసాము, బుట్టబొమ్మలు, భేతాళసెట్టు, నాసిక్ డోల్ లాంటి కళారూపాలు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించాయి. ఇవన్నీ ఆధ్యాత్మికతను పెంచేవే. పర్యాటకాన్ని అభివృద్ధి చేసేవే. టెంపుల్ టూరిజం కూడా ఏపీ ఆర్థికాభివృద్ధికి ముఖ్యం. ఏపీలో ఉన్న పుణ్యక్షేత్రాలు మన సంపద, మన వారసత్వం.” అని చంద్రబాబు అన్నారు.
ప్రజా సహకారంతో మరింత అభివృద్ధి

“ఏడాదిన్నర కిందటి వరకూ రాష్ట్ర ప్రజల ముఖాల్లో ఆనందమే లేదు. ఎక్కడ చూసినా భయం, దాడులు, ఆవేదనే నాడు రాజ్యమేలాయి. కూటమి అధికారంలోకి వచ్చాకే ప్రజల ముఖాల్లోకి స్వేచ్ఛ, సంతోషం వచ్చింది. పవన్ కల్యాణ్, బీజేపీతో కలిసి సుపరిపాలన అందిస్తామని ఇచ్చిన హామీని విశ్వసించి రికార్డు స్థాయిలో గెలిపించారు. ఈ సహకారాన్ని భవిష్యత్తులోనూ అందించాలి. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు సంతోషంగా ఉన్నారు. సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేసిన ఘనత ప్రజలదే. రూ.2.50 లక్షల చొప్పున ప్రజలందరికీ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్సు తీసుకువచ్చిన రాష్ట్రం ఏపీనే. తల్లికి వందనంతో చదువుకునే పిల్లలందరికీ అండగా నిలిచాం. ప్రజలు ఆనందంగా ఉండేలా సమాజ నిర్మాణం చేస్తామని హామీ ఇస్తున్నాను.” అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నేతలు, అధికారులు, సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ ప్రతినిధులు పాల్గొన్నారు.


