- పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు
కాకతీయ, సుజాతనగర్ : భూములకు ధరలు ఆకాశాన్ని తాకుతున్న క్రమంలో అంగుళం భూమి కూడా బంగారమే అవుతుంది. ఈ క్రమంలో తమ స్థలం పక్కన ప్రభుత్వ భూములు ఏవైనా ఉంటే మూడో కంటికి కనపడకుండా కబ్జా చేస్తున్నారు కొందరు భూభకాసూరలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూములను కొందరు రియల్టర్లు కొనుగోలు చేసి, వాటిని ప్లాట్లు చేసి అమ్మకాలు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ప్లాట్ల మధ్య నుంచి పంట పొలాలకు నీరందించే ప్రధాన కుడి కాలువ ఏడో తూమును (సింగభూపాలెం చెరువు) దర్జాగా కబ్జా చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు, సాగు ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు.
బఫర్ జోన్ లో ఇరిగేషన్ శాఖ నుండి అనుమతులు తీసుకోకపోతే డీటీసీపీ వెంచర్ కు అనుమతి రాదు. కానీ ఆ శాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎలా వచ్చిందో అధికారులకే తెలియాలని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు స్పందించి సింగభూపాలెం చెరువు నుంచి సాగునీరు అందించే ప్రధాన కాలువ కబ్జా చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కాలువ కబ్జా గురించి వివరణ కోరేందుకు ఇరిగేషన్ డీఈ ను ఫోన్ ద్వారా సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.


