సీపీఐ వందేళ్ల చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
జనవరి 18న ఖమ్మంలో వందేళ్ల బహిరంగ సభ
3 నుంచి 7 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రచార జాతా
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా
కాకతీయ, కొత్తగూడెం : సీపీఐ వందేళ్ల ఉద్యమ చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా పిలుపునిచ్చారు. మంగళవారం కొత్తగూడెంలోని సీపీఐ జిల్లా కార్యాలయం ‘శేషగిరి భవన్’లో జరిగిన పట్టణ విస్తృత జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల చరిత్ర కార్మిక, కర్షక, పేద ప్రజల పోరాటాలతో ముడిపడి ఉందని అన్నారు. జనవరి 18న ఖమ్మంలో నిర్వహించే సీపీఐ వందేళ్ల బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ప్రతి కమ్యూనిస్టు కుటుంబం ఈ చారిత్రక ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలన్నారు. వందేళ్ల ఉత్సవాల ప్రచారంలో భాగంగా జనవరి 3 నుంచి 7 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రచార జాతా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాతా ద్వారా సీపీఐ పోరాట చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్టు భావజాలం మరింత అవసరమని, ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ ముందుండి పోరాడుతుందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కందుల భాస్కర్, ఎస్.కె. ఫహీమ్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


