స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం
సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు
సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రం
కాకతీయ, ఖమ్మం : రంగవల్లికలు తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రం, ఐద్వా ఖమ్మం డివిజన్ కార్యదర్శి పత్తి పాక నాగ సులోచన అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఖమ్మం నగరంలోని 17వ డివిజన్ శ్రీనివాస నగర్‌లో సీపీఐ(ఎం), డీవైఎఫ్ఐ, ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల బహుమతి ప్రధానోత్సవ సభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. మహిళలు, యువత, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సీపీఐ(ఎం)తో పాటు అనుబంధ సంఘాలైన ఐద్వా, డీవైఎఫ్ఐ మాత్రమే నిరంతరం పోరాటాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. సమస్యలపై ఉద్యమాలు నిర్వహించడమే కాకుండా మహిళల్లోని సృజనాత్మకతను వెలికితీయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ ఏడాది నగర వ్యాప్తంగా ఒక్కరోజే 14 కేంద్రాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించామని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు యర్రాశ్రీకాంత్ తనయుడు, పార్టీ త్రీటౌన్ కమిటీ వర్గ సభ్యుడు యర్రా రంజిత్ సహకారంతో 17వ డివిజన్‌లో నిర్వహించిన పోటీలు అభినందనీయమని అన్నారు. నగరంలోని స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం) ద్వారానే శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని, రానున్న ఎన్నికల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలైన మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయడంతో పాటు, పోటీల్లో పాల్గొన్న 250 మంది మహిళలకు కన్సోలేషన్ బహుమతులు పంపిణీ చేశారు. త్రీటౌన్ ఐద్వా కార్యదర్శి బి. సునీత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జడ్జీలుగా చెరుకూరి రాజి, మాదినేని లక్ష్మి పాల్గొన్నారు. అలాగే సీపీఐ(ఎం), ఐద్వా నాయకులు బండారు యాకయ్య, ప్రకాశ్ రావు, వీరయ్య, జి. పున్నయ్య, బడే మియా, యర్రా మల్లిఖార్జున్, పి. మోహన్ రావు, జి. భూలక్ష్మి, బండారు మంగమ్మ, రమణ, ఉమా తదితరులు పాల్గొన్నారు.


