మరో వందేళ్లూ ప్రజాక్షేత్రంలోనే సీపీఐ
● శతవసంతాలు పూర్తి చేసుకున్న ఏకైక పార్టీ
● సమ సమాజం–సమానత్వమే లక్ష్యం
● జనవరి 18న ఖమ్మంలో 5 లక్షల మందితో మహాసభ
● జిల్లావ్యాప్తంగా ఘనంగా శతవసంత వేడుకలు
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : ఈ దేశంలో శతవసంతాలు పూర్తి చేసుకున్న ఏకైక రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) అని, పేదలు–బడుగు–బలహీన వర్గాల కోసం సాగిన పోరాటాలే తమ ప్రస్థానమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా అన్నారు. మరో వందేళ్లైనా ప్రజాక్షేత్రంలోనే నిలిచి పోరాడుతామని స్పష్టం చేశారు. 1925లో కాన్పూరులో ఆవిర్భవించిన సిపిఐ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందన్నారు. బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో ఎందరో కమ్యూనిస్టులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. జమిందారీ, పెత్తందారీ విధానాల నిర్మూలనలో సిపిఐ చేసిన త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. జిల్లాలో సిపిఐ శతవసంత వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయం శేషగిరి భవన్, పోస్టాఫీస్ సెంటర్‌లో ఎర్రజెండా ఆవిష్కరణ చేశారు. వేలాది మందితో కొత్తగూడెం కేంద్రంగా భారీ ర్యాలీ నిర్వహించారు.

మత రాజకీయాలకు గట్టి ఎదురుదెబ్బ
మతం, కులం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే శక్తులకు సిపిఐ గట్టి ప్రతిఘటనగా నిలుస్తుందన్నారు. సంపద కొద్దిమందికే పరిమితం కాకుండా సమానంగా పంచబడే సమ సమాజమే సిపిఐ లక్ష్యమని తెలిపారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జనవరి 18న ఖమ్మంలో 5 లక్షల మందితో సిపిఐ శతవసంత ఉత్సవాల ముగింపు సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


