సీపీఐ అజేయ శక్తని రుజువైంది
ఏ ఎన్నికలైనా సీపీఐదే పై చేయి
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ఎజెండా
ఒంటరి పోరులో అనూహ్య విజయాలు
స్థానిక నాయకుల తీరుతోనే పొత్తు చెడింది
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కాకతీయ, కొత్తగూడెం : గ్రామ పంచాయితీ ఎన్నికల్లో సిపిఐ అజేయ శక్తిగా నిలిచిందని, అవాకులు చెవాకులు పేలిన వారి నోళ్లు ఒక్కసారిగా మూతపడ్డాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గెలిచిన సిపిఐ సర్పంచులు, వార్డు సభ్యులు నిస్వార్థంగా, పారదర్శకంగా ప్రజారంజక పాలన అందించాలని ఆయన సూచించారు. శుక్రవారం కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించిన నూతనంగా గెలుపొందిన సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన సభలో కూనంనేని ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం అధ్యక్షత వహించారు.
పోటాపోటీగా ఒంటరి పోరుకు దిగిన సిపిఐ జిల్లా వ్యాప్తంగా 47 సర్పంచ్ స్థానాలను మంచి మెజార్టీతో గెలుచుకుందని, అలాగే 57 ఉపసర్పంచ్ పదవులు దక్కించుకున్నామని తెలిపారు. మొత్తం 432 వార్డుల్లో ఎర్రజెండా రెపరెపలాడుతోందని, ప్రధాన గ్రామ పంచాయితీలు సైతం సిపిఐ ఖాతాలో చేరాయని పేర్కొన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ కంటే సిపిఐకి ఎక్కువ ఓట్లు పోలయ్యాయని వెల్లడించారు. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కనీస మద్దతు కూడా లభించలేదని, అయినప్పటికీ సిపిఐ స్నేహధర్మాన్ని పాటిస్తూ గతంలో కాంగ్రెస్ సర్పంచులు ఉన్న చోట్ల తమ అభ్యర్థులను నిలబెట్టలేదని చెప్పారు. అయినా కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతూ దిగజారుడు రాజకీయాలు చేశారని విమర్శించారు. తామేమో విలువలతో కూడిన, క్రమశిక్షణతో కూడిన రాజకీయాలకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
త్వరలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ సిపిఐదే పై చేయి ఉంటుందని కూనంనేని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ పరిస్థితులు, ఆయా పార్టీల రాష్ట్ర నాయకత్వాల నిర్ణయాల మేరకు కార్యచరణ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా మాట్లాడుతూ గెలిచిన అభ్యర్థులు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని, ఓటమి పాలైన వారు నిరాశ చెందకుండా రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులను శాలువాలతో సత్కరించి మెమొంటోలు అందజేశారు.


