ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!
విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా
ఖమ్మం వామపక్ష కుటుంబాల యువత చొరవ
కమ్యూనిజమే ప్రత్యామ్నాయమని నినాదం
శతాబ్ది ఉత్సవాలకు అంతర్జాతీయ గుర్తింపు
కాకతీయ, ఖమ్మం :భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శతాబ్ది ఉత్సవాలు దేశంలోనే కాకుండా ఖండాంతరాల్లోనూ ఘనంగా కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన కమ్యూనిస్టు పార్టీ కుటుంబాలకు చెందిన యువత అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో నివసిస్తూ సిపిఐ వందేళ్ల పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.
వామపక్ష భావజాలంతో ముందుకు సాగుతున్న ఈ యువత ఒకేచోట చేరి పార్టీ చరిత్రను స్మరించుకుంటూ, భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం మరింత బలపడాలని ఆకాంక్షలు వ్యక్తం చేస్తున్నారు. సిపిఐ శతాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అంతర్జాతీయ స్థాయిలో పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారు.
లండన్‌లో శతాబ్ది వేడుకలు
సిపిఐ ఖమ్మం నగర కార్యదర్శి ఎస్.కె. జానిమియా తనయుడు లతీఫ్ పాషా నాయకత్వంలో లండన్‌లో సిపిఐ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు సాగిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ వామపక్ష ఉద్యమ ప్రాధాన్యతను చర్చించారు.
ఇతర దేశాల్లోనూ ఇదే తరహాలో శతాబ్ది వేడుకలు నిర్వహిస్తూ, రానున్న కాలంలో కమ్యూనిస్టు ఉద్యమం మరింత పురోగమించాలని ఆకాంక్షించారు. పెరుగుతున్న అసమానతలకు, కార్పొరేట్ ఆధిపత్యానికి కమ్యూనిజమే సరైన ప్రత్యామ్నాయమని విద్యావంతులైన యువత బలంగా చాటిచెబుతున్నారని నిర్వాహకులు తెలిపారు.


