- కార్మికుల హక్కుల కోసం పోరాడిన ముక్తార్ పాషా
- పాషా వర్ధంతి సభలో నేతలు సీతారామయ్య, మంగ
కాకతీయ, కొత్తగూడెం రూరల్: కార్పొరేట్ శక్తులు, పెట్టుబడి దారులు, యాజమాన్యాలు కార్మికవర్గంపై సాగిస్తున్న శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్టియు)జాతీయ ప్రధాన కార్యదర్శి దివంగత ముక్తార్ పాషా40 ఏండ్ల పాటు ఎన్నో పోరాటాలను నిర్వహించాడని, అలాంటి వ్యక్తిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అన్నారు. పాషా ఐదో వర్ధంతి సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సంతాప సభను నిర్వహించారు.
ఈ సభకు జిల్లా కోశాధికారి మోత్కూరి మల్లికార్జున్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జే.సీతారామయ్య, పిఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ మాట్లాడారు. కార్మిక వర్గానికి అంకితమై పాషా సాగించిన రాజీలేని పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. బొగ్గుగని కార్మికుల వేతన ఒప్పందాలు, కోయగూడెం ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో పాషా కీలక పాత్ర పోషించాడని, సింగరేణిలో పనిచేస్తున్న 35 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు చట్టబద్ధ హక్కులకై మిలిటెంటు పోరాటాలు, నిరవధిక సమ్మెలు నిర్వహించి విజయం సాధించాడని అన్నారు.
దేశంలో ప్రస్తుతం కార్మిక వర్గం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా సమరశీలంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు, ప్రముఖన్యాయవాది సింగు ఉపేందర్ రావు, ఐఎఫ్ టియు జిల్లా సహాయ కార్యదర్శి ఎన్.సంజీవ్, జిల్లా నాయకులు గౌని నాగేశ్వర రావు, సీనియర్ నాయకులు అలీముద్దిన్, ఎల్.మారుతీరావు, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, రాజేశ్వరి, శారద, ఫిరోజ్, వినోద్, మురళి తదితరులు పాల్గొన్నారు.


