బీజేపీ అండతో అలియాబాద్ కాంగ్రెస్ కైవసం
హంగ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు బీజేపీ మద్దతు
చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి కంఠం శిరీష ఎన్నిక
20 వార్డుల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాక ఉత్కంఠ
కాంగ్రెస్–బీజేపీ–ఇతరుల మద్దతుతో సమీకరణాలు మార్పు
కాకతీయ, మేడ్చల్ : మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నిక ఉత్కంఠభరితంగా సాగి చివరికి కాంగ్రెస్ పార్టీ విజయంతో ముగిసింది. కాంగ్రెస్ అభ్యర్థి కంఠం శిరీష మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికై పీఠాన్ని దక్కించుకున్నారు. హంగ్ పరిస్థితులు నెలకొన్న ఈ మున్సిపాలిటీలో చివరి నిమిషం వరకు రాజకీయ సమీకరణాలు వేడెక్కగా, భాజపా మద్దతుతో కాంగ్రెస్ విజయం సాధించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అలియాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు గెలుచుకోగా, బీఆర్ఎస్ 7, బీజేపీ 3, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడంతో చైర్‌పర్సన్ ఎన్నిక ఉత్కంఠభరితంగా మారింది. మేజిక్ ఫిగర్ చేరేందుకు అదనపు మద్దతు అవసరమవడంతో ప్రధాన పార్టీలు తమ సమీకరణాలపై దృష్టి సారించాయి.
బీజేపీ, ఇతరుల మద్దతుతో కాంగ్రెస్‌కు పీఠం
చైర్‌పర్సన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ సభ్యులు, ఇతరుల మద్దతును కూడగట్టడంలో సఫలీకృతమైంది. ఈ మద్దతుతో కాంగ్రెస్ బలం పెరగడంతో కంఠం శిరీష చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. చైర్‌పర్సన్‌గా కంఠం శిరీష ఎన్నిక కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం నెలకొంది. మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. హంగ్ పరిస్థితుల మధ్య సాగిన అలియాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలో బీజేపీ మద్దతు కాంగ్రెస్‌కు కీలకంగా మారి పీఠాన్ని కైవసం చేసుకునేలా చేసింది.


