కాంగ్రెస్‌ను పాతరేయాలి
అబద్దపు హామీలతో ప్రజలను తప్పుదోవ
చేర్యాలలో ఒక్క పని చేయని కాంగ్రెస్
ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి
అభివృద్ధి, సేవే బీఆర్‌ఎస్ లక్ష్యం
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
ఉచిత వైద్య సేవలు కొనసాగిస్తానని హామీ
కాకతీయ, చేర్యాల : ఎన్నికల ముందు ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వాటిని నెరవేర్చకుండా మరోసారి ప్రజలను మోసం చేయడానికి ఓట్ల కోసం వస్తోందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్‌ను ఈ ఎన్నికల్లో పాతరేయాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 4, 5, 6, 7, 8, 9 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. వార్డు అభ్యర్థుల కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేర్యాల పట్టణంలో ఇప్పటివరకు కనిపిస్తున్న అభివృద్ధి అంతా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త పని కూడా చేపట్టలేదని విమర్శించారు. ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, రాబోయే రోజుల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ ..!
ప్రత్యర్థి పార్టీలు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, అమలు కాని హామీలతో మోసం చేస్తున్నాయని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తన సొంత నీలిమ ఆసుపత్రిలో గత రెండు సంవత్సరాలుగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నానని, ఈ సేవలు రాబోయే మూడు సంవత్సరాలు కూడా కొనసాగిస్తానని తెలిపారు. పేద ప్రజలు స్వంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న సందర్భాల్లో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా చెక్కులు అందజేస్తున్నామని, నిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్సల కోసం ఎల్ఓసీలు మంజూరు చేస్తున్నామని వివరించారు. ఇచ్చిన హామీలను ఆచరణలో చూపిస్తున్నానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న పనులను ప్రజలు బేరీజు వేసుకోవాలని ఆయన కోరారు. కల్యాణలక్ష్మి, తులం బంగారం పొందినవారు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని, అవి పొందని వారు బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని వ్యాఖ్యానించారు. మహిళా భృతి రూ.2500 అందిన మహిళలు కాంగ్రెస్‌కు ఓటేయాలని, భృతి అందని వారు బీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలు కాలేదని గుర్తు చేస్తూ, ఆ హామీ నెరవేరని మహిళలంతా కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. పట్టణ అభివృద్ధికి బీఆర్‌ఎస్ పార్టీ చేసిన సేవలను ప్రజలు గుర్తించి, ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


