- ‘చిల్లర గాళ్లు’ అన్న మాటలు వెనక్కు తీసుకోవాలి
- నల్గొండ రమేష్ ఇంట్లో మీడియా సమావేశం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి :మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు తీవ్రంగా స్పందించారు. పీసీసీ సభ్యుడు నల్గొండ రమేష్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ఆ వ్యాఖ్యలను ఖండించారు. ‘‘పట్టిన జెండాను విడవకుండా నలభై ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాం. అలాంటి సీనియర్లను ‘చిల్లర గాళ్లు’ అంటూ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం తీవ్రంగా ఖండనీయం’’ అని వారు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అంటూ పార్టీలు మారింది ఎవరో ముందుగా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. శాసనసభ ఎన్నికల్లో తేనేటి విందులు పెట్టి, ఏకమై మెజార్టీతో గెలిపించిన విషయాన్ని మరిచిపోయారా? అని ప్రశ్నించారు. ‘‘ఆ తేనేటి విందులే ఇప్పుడు మింగుడు పడని విషంగా మారాయా?’’ అంటూ విమర్శించారు.
పార్టీ పరువును రోడ్డున పడేస్తూ చిల్లర పనులు చేసింది ఎవరో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన కార్పొరేటర్లకే ప్రాధాన్యం ఇవ్వడం సరికాదన్నారు. ఎంపీ ఎన్నికల్లో మంత్రి హోదాలో ఏ పార్టీకి మెజార్టీ వచ్చిందో ప్రజలకు, అధిష్టానానికి బాగా తెలుసని వ్యాఖ్యానించారు.‘‘ఏ పార్టీకి వెళ్లి వచ్చినా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించిన ఘనత సీనియర్లదే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’’ అని స్పష్టం చేశారు. కార్పొరేటర్లు ఎమ్మెల్యేను కలవాలంటే ఓ అనామకుడి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ఓ మాజీ రౌడీషీటర్ చేతిలో వరంగల్ తూర్పు భవిష్యత్తును పెట్టారని ఆరోపించారు. స్వపక్షం, ప్రతిపక్షం తేడా లేకుండా అక్రమ కేసులు పెట్టిన ఘనత మీదేనని మండిపడ్డారు. పార్టీలో కార్యకర్త హోదా కూడా లేని వ్యక్తి దగ్గరకు కార్పొరేటర్లు, నాయకులు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. చివరగా, సీనియర్లను ఉద్దేశించి చేసిన ‘చిల్లర గాళ్లు’ అన్న వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్లు డిమాండ్ చేశారు.


