నేడు కాంగ్రెస్ ముత్యాల ముగ్గుల పోటీలు
కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు ప్రారంభం
విజేతలకు లక్ష రూపాయలకుపైగా నగదు బహుమతులు
కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళ కాంగ్రెస్, రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం 3 గంటల నుంచి కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ముత్యాల ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా డీసీసీ అధ్యక్షురాలు దేవిప్రసన్న తెలిపారు. ఆదివారం ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ… కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 33 డివిజన్ల నుంచి మహిళలు పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. విజేతలకు రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు.
నగదు బహుమతుల వివరాలు
మొదటి బహుమతి రూ.30 వేలు, రెండో బహుమతి రూ.25 వేలు, మూడో బహుమతి రూ.20 వేలు, నాలుగో బహుమతి రూ.15 వేలు, ఐదో బహుమతి రూ.10 వేలు అందజేస్తామని తెలిపారు. అదనంగా ఐదుగురికి కన్సోలేషన్ బహుమతులు రూ.5 వేల చొప్పున ఇవ్వనున్నట్లు చెప్పారు. పోటీల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ఆకర్షణీయమైన బహుమతులు అందిస్తామని పేర్కొన్నారు. పోటీదారులు తమకు కావాల్సిన ముగ్గుల రంగులను స్వయంగా తీసుకురావాలని, ఒక గంట వ్యవధిలో ముగ్గు వేయాల్సి ఉంటుందని తెలిపారు. విజేతల నిర్ణయం న్యాయనిర్ణేతలదేనని స్పష్టం చేశారు. పోటీ ప్రారంభానికి ముందు వరకు పేర్ల నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు.


