మధిరలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది
వరుసగా 11 వార్డుల్లో కాంగ్రెస్ విజయం
ఒక వార్డులో టీడీపీ మద్దతుతో కాంగ్రెస్ గెలుపు
ప్రారంభ రౌండ్ల నుంచే ఏకపక్ష ఆధిక్యం
మిగిలిన వార్డుల ఫలితాలపై ఆసక్తి
కాకతీయ, మధిర : మధిర మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో వరుసగా 11 వార్డులను కాంగ్రెస్ అభ్యర్థులు కైవసం చేసుకోవడంతో పట్టణంలో ఏకపక్ష వాతావరణం నెలకొంది. ప్రారంభ రౌండ్ల నుంచే కాంగ్రెస్ అభ్యర్థులు ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు.
1వ వార్డు నుంచి 9వ వార్డు వరకు కాంగ్రెస్ అభ్యర్థులు వరుసగా గెలుపొందారు. ఈ విజయాలు పార్టీ శ్రేణుల్లో భారీ ఉత్సాహాన్ని నింపాయి. ముఖ్యంగా ప్రతి వార్డులోనూ కాంగ్రెస్ అభ్యర్థులు స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించడం గమనార్హం.
10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి టీడీపీ మద్దతుతో పోటీ చేసి విజయం సాధించారు. ఈ గెలుపుతో కాంగ్రెస్‌కు మరింత బలం చేకూరింది. 11వ వార్డులో కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడంతో మొత్తం 11 వార్డులు పార్టీ ఖాతాలో చేరాయి.
ఇప్పటివరకు వచ్చిన ఫలితాలను బట్టి మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మిగిలిన వార్డుల ఫలితాలు వెలువడాల్సి ఉండటంతో కాంగ్రెస్ పూర్తి మెజారిటీతో మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


