గౌడ్‌లను మోసం చేస్తున్న కాంగ్రెస్
కామారెడ్డి సభలో ఇచ్చిన హామీల అమలేది..?
మద్యం టెండర్లలో 25శాతం వాటా ఇస్తామని మాటతప్పింది
కేటాయింపు చేసేలా వెంటనే చర్యలు చేపట్టాలి
లేదంటే మద్యం టెండర్ల ప్రక్రియను అడ్డుకుంటాం
తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి నలమాస శ్రీకాంత్ గౌడ్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ గౌడ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను తుంగలొ తొక్కేస్తోందని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి నలమాస శ్రీకాంత్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయకుండా దాటవేత విధానాలను అవలంభిస్తోందన్నారు. బీసీలకు42% రిజర్వేషన్లు కల్పిస్తామని బిల్లు చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. రిజర్వేషన్స్ మా పరిధిలో లేవని న్యాయ స్థానాల పరిధిలో, కేంద్రం పరిధిలో ఉన్నాయని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో గౌడ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు మద్యం టెండర్లలో 25% వాటా ఇవ్వాల్సిందేనని అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ హామీపై కనీసం ఊసే ఎత్తకుండా మద్యం టెండర్లను ఆహ్వానించిందని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ గౌడ్‌లను ఓటు బ్యాంకుగా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోందని ఆరోపించారు.
ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం లేదు
గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఎక్కడా ఇవ్వడం లేదని శ్రీకాంత్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల్లో ఎంతమందికి ఎక్స్‌గ్రేషియో చెల్లించారో దమ్ముంటే ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాలని అన్నారు. ఊరురా, ప్రతి గ్రామ పంచాయితీ కి 5 ఎకరాల స్థలం గీత కార్మికులకు కేటాయించి ఈత, తాటి వనాలను పెడతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్న హామీపై దృష్టి పెట్టడం లేదన్నారు. గౌడ్‌లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని రేవంత్ రెడ్డి సర్కారు అమలు చేయాలని, లేని పక్షంలో తప్పకుండా తగు సమయంలో బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. మద్యం టెండర్ల గౌడ సామాజిక వర్గానికి 25శాతం వాటాను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని, లేని పక్షంలో టెండర్ల ప్రక్రియను అడ్డుకుంటామని అన్నారు.
యూరియా కోసం రైతుల అరిగోస..!
కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతన్నలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేస్తే… కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం రైతన్న అరిగోస పడుతున్నారని శ్రీకాంత్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో రైతాంగాన్ని రేవంత్ రెడ్డి సర్కారు ఆగం చేసిందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయంపై, సాగు, ఎరువుల అవసరాలపై ప్రణాళిక లేని వైఖరితో ఉండటంతో ఈ రోజు అన్నదాతలు రోడ్డెక్కాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గుడెద్దు వైఖరిని నిరసిస్తూ త్వరలోనే రైతులతో కలిసి పోరాటానికి సిద్ధమవుతామని అన్నారు.


