పెద్దబీరవల్లిలో కాంగ్రెస్‌లో కలకలం! గ్రామ అధ్యక్షుడి బహిష్కరణ
సీపీఎంతో రహస్య ఒప్పందం ఆరోపణలు
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలుస్తామని ప్రకటన
కాకతీయ, బోనకల్ : మండల పరిధిలోని పెద్దబీరవల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆళ్ల మోహన్ రావును పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు గ్రామ కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు పంది వెంకులు నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని పోటీలో లేకుండా చేసి సీపీఎం పార్టీని ఏకగ్రీవం చేయడానికి రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. పార్టీ నిబంధనలను, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలను విస్మరించి వ్యవహరించారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతివ్వకుండా, వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని బహిరంగంగా సవాల్ విసిరినట్లు పేర్కొన్నారు. గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఏకగ్రీవంగా బహిష్కరణ తీర్మానం చేసినట్లు తెలిపారు. ఇకపై గ్రామ కాంగ్రెస్ పార్టీకి ఆయనతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. త్వరలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి పూర్తి వివరాలు తెలియజేస్తామని వెల్లడించారు. సమావేశంలో పలువురు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


