కాకతీయ, బయ్యారం: సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ కార్యదర్శి కామ్రేడ్ చంద్రన్న పై కొద్దిరోజుల నుండి అశోక్ ముఠా అదే పనిగా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ సోమవారం సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ అధ్వర్యంలో మండల కేంద్రంలోని విబిటి ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఆరేల్లి కృష్ణ మాట్లాడారు.
బయ్యారంలో రెండు విప్లవ సంస్థల విలీనం పేరిట అశోక్ ముఠా, సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రటిక్, రివల్యూషనరీకి చెందిన నాయకులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో తమ రాజకీయ విధి విధానాలు తెలుపకుండా సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చంద్రన్న పై తప్పుడు ప్రచారానికి పూనుకున్నారని అన్నారు. వీరి అబద్ధాలను, అసత్యపు రాతలను ఖండించాలని ప్రజలకు, ప్రజాస్వామిక వాదులకు, విప్లవ శ్రేణులకు తెలిపారు.
అశోక్ అరెస్టయి జైలు నుండి విడుదలైన నాటి నుంచి పార్టీ నిర్మాణ సూత్రాలకు కట్టుబడకుండా, రహస్య జీవితానికి స్వస్తి పలికి లీగల్ జీవితానికి అలవాటు పడ్డాడని విమర్శించారు. పార్టీ రాష్ట్ర, కేంద్ర కమిటీకి తెలియకుండా అప్పులు చేసి తమ స్వార్థానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ సందర్భంలో చంద్రన్న ఆస్తులపై విచారణ జరిపించవచ్చని, విప్లవ సంస్థలకు, హక్కుల సంఘాలకు తెలియజేయడంలో అశోక్ ది కూడా కీలకపాత్రేనన్నారు.
సమావేశంలో మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యులు జీవన్, నాయకులు అలకుంట్ల సాయిలు, దొంతోజు ఉపేందర్, సిద్దబోయిన జీవన్, భద్రాద్రి జిల్లా కార్యదర్శి కొమరం సత్యనారాయణ, సహాయ కార్యదర్శి కందగట్ల సురేందర్, ఖమ్మం జిల్లా కార్యదర్శి తాతా సత్యనారాయణ, ఉప్పరబోయి రాంముర్తి, జోగ రణధీర్, పడిగ శ్రీను, ఖాజా పాషా, కేశ లింగయ్య, షేరు మధు, కర్నకర్, గొట్టం రాములు, వీరమల్ల ఉమ, మల్లురి సుగుణ, జానీ, యనగంటి భూషణం, చర్ప క్రిష్ణ, పి.డి.ఎస్.యూ రాష్ట్ర నాయకుడు జె.గణేష్ తదితరులు పాల్గొన్నారు.


