- రాజకీయ ఎన్నికలను తలపిస్తున్న వర్తక సంఘ ఎన్నికలు
ఓటర్లను ఆకట్టుకునేందుకు మందు పార్టీలు
రెండు ప్యానల్లకు దీటుగా ఇండిపెండెంట్ల ప్రచారం
హోరాహోరీగా అభ్యర్థుల ప్రచారం
ఉత్కంఠ రేపుతున్న ఫలితం

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం నగరంలో వర్తక సంఘ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు ఖర్చుకు వెనకాడటంలేదు. ఓటర్లను ఆకట్టు కునేందుకు పెద్దపెద్ద హోటల్, రెస్టారెంట్లలో మందుపార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చేనెల 16న జరగనున్న ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వర్తక సంఘ నాయకులు 15 రోజులుగా విస్తృత ప్రచారం చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. వర్తక సంఘంలో నాయకుడిగా చలామణి అయ్యే వ్యక్తికి ఎంత ప్రయోజనం ఉంటుందో తెలియదు కానీ వారు చేస్తున్న ఆర్భాటాలు.. ఖర్చు చూస్తే మాత్రం ఔరా అనిపించాల్సిందే.
1305 మంది సభ్యులు..
1305 మంది సభ్యులుగా ఉన్న వర్తక సంఘంలో కొంతమంది నాయకులుగా ఏర్పడి ప్రతి సభ్యుడు కష్టనష్టాల్లో పాలుపంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా రాజకీయ నాయకులు వల్లే ప్రచారాలు చేస్తూ గెలిచిన తర్వాత తోటి సభ్యులపైనే పెత్తనం చేస్తూ కొంతమంది అక్రమార్కులకు అంటగాగుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ విధంగా ప్రతి మూడేళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న కొందరు అభ్యర్థులు అడ్డదారుల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు డబ్బులు, మద్యం పార్టీలు, అక్కరలేని హామీలు, ఊహించని బహుమతులు అప్పజెప్పుతూ జోరుగా ప్రచారాలు చేయడం పరపాటిగా మారింది. అయితే ఈ ఎన్నికల కోసం చమటోడ్చి ప్రచారంలో నిలబడ్డ వ్యక్తికి రాజకీయ నాయకుల హెచ్చరికలు కూడా ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు.
రాజకీయనేతల జోక్యం!
గడిచిన ఆరేళ్లలో సంఘం అధ్యక్ష, కార్యదర్శుల ప్యానళ్లు జరిగే ఎన్నికలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అటు రెండు ఇటు రెండు ప్యానల్ అభ్యర్థులు వారివారి బలాలు నిరూపించుకునేందుకు రాజకీయ నాయకుల సపోర్ట్ తీసుకుంటున్నారు. అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకుంటే గెలుపునకు చెరువలో ఉన్న వ్యక్తి ఆ పార్టీకి చెందిన నేత చెప్పినట్లుగా పక్కగా తప్పుకొని వెనుదిరగాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంది. గతంలో జరిగిన ఎన్నికల్లో ఇలాంటి ఘటనే జరిగింది. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థుల విషయానికి వస్తే వారి వెనుక కూడా కొంతమందికి రాజకీయ పలుకుబడి ఉంటది, మరి కొంతమందికి స్వతహాగా పెంచుకున్న పలుకుబడి ఉంటది. వీరు కూడా ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాన ప్యానల్లా అభ్యర్థులకు దీటుగా పోటీచేసి గెలుపుపై ధీమా పెంచుకుంటున్నారు. ఈ ఎన్నికలు నిర్వహణపై రాజకీయ, అధికారుల జోక్యం తక్కువగా ఉండడంతో వీరు బైలాను సైతం పక్కన పెట్టి ప్రచారాలు చేస్తున్నట్లు తోటి సభ్యులు చెప్పుకొస్తున్నారు.


