అదుపుతప్పి బోల్తా పడిన కాలేజీ వ్యాన్
20 మందికిపైగా విద్యార్థులకు గాయాలు
భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలింపు
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి : ఎమ్మెల్యే పాయం
కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట సమీపంలో శుక్రవారం కాలేజీ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. మణుగూరు నుంచి పాల్వంచలోని కేఎల్ఆర్ కాలేజీకి విద్యార్థులను తీసుకొస్తున్న వ్యాన్ కల్వర్టు వద్ద అదుపుతప్పడంతో రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికిపైగా విద్యార్థినీ, విద్యార్థులు గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరిద్దరికి చేతులు విరిగినట్లు సమాచారం. తీవ్ర గాయాలైన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో వ్యాన్‌లో సుమారు 60 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.

మెరుగైన వైద్యం అందించాలి: ఎమ్మెల్యే పాయం
ఘటన విషయం తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాచలం ఏరియా ఆసుపత్రి వైద్యులను సంప్రదించి, క్షతగాత్రులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అనంతరం ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన విద్యార్థులను అంబులెన్స్‌లలో ఎక్కించడంలో సహకరించడంతో పాటు, భయాందోళనలో ఉన్న వారికి ధైర్యం చెప్పారు. ఆయన సేవాభావాన్ని స్థానికులు ప్రశంసించారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు వ్యాన్ సాంకేతిక స్థితి కూడా సరిగా లేకపోయి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నూతన సంవత్సర ప్రారంభంలోనే ఈ ఘటన జరగడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.


