ప్రజావాణి ఫిర్యాదులపై కలెక్టర్ సీరియస్
ఆలస్యం చేస్తే చర్యలు తప్పవు
ప్రజల అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
ఇందిరమ్మ ఇళ్లు, భూమి వివాదాలు, రహదారి సమస్యలపై స్పందన
తక్షణమే నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు
కాకతీయ, ఖమ్మం : ప్రజావాణిలో అందుతున్న ప్రజల అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాటిపై వెంటనే స్పందించిన ఆయన సంబంధిత శాఖ అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్లు, భూమి సమస్యలపై స్పందన
వైరా మండలం గన్నవరం గ్రామానికి చెందిన కిన్నెర రాణి తనకు ఇందిరమ్మ ఇల్లు మొదటి విడత నిధులు జమ అయినప్పటికీ తదుపరి విడతలు జమ కాలేదని ఫిర్యాదు చేయగా, హౌజింగ్ పీడీని విచారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఖమ్మం అర్బన్ గోపాలపురం గ్రామానికి చెందిన ఎస్.కె. రజియా తనకు ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరగా, సంబంధిత అధికారులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనిజర్ల మండలం గుండ్రాతిమడుగు గ్రామానికి చెందిన సయ్యద్ లాల్ బి తన పేరున్న భూమిలో కొంత భాగాన్ని తన కుమార్తెలకు రిజిస్ట్రేషన్ చేయడంలో అసైన్డ్ భూమిగా చూపిస్తున్నారని ఫిర్యాదు చేయగా, తహశీల్దార్‌ను విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
రైతుల భూములకు రహదారి సమస్యపై ఆదేశాలు
రఘునాధపాలెం మండలం మంచుకొండ, కోయచిలక గ్రామాల రైతులు తమ వ్యవసాయ భూములకు వెళ్లే దారిని కొందరు అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేయగా, సంబంధిత తహశీల్దార్‌ను పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజావాణి కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్ష రైనా, జిల్లా అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.


