పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ కె. హైమావతి
కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హైమావతి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల–పెద్దమ్మగడ్డ, పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (కో-ఎడ్యుకేషన్)లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆమె సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు.
కొన్ని కేంద్రాల్లో వైద్య శిబిరాలు, బీఎల్ఓ స్లిప్ పంపిణీ కేంద్రాలు పోలింగ్ కేంద్రం లోపల ఏర్పాటు చేసినట్లు గమనించిన కలెక్టర్, వాటిని వెంటనే బయటకు మార్చాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని మున్సిపల్, రెవెన్యూ అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఏసీపీ వెంకట్రావు, మున్సిపల్ కమిషనర్ నాగేందర్, తహసీల్దార్ దిలీప్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


