ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్
జితేష్ వి. పాటిల్
కాకతీయ,కొత్తగూడెం ప్రతినిధి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్‌లో జగ్గు తండ ఎంపీపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి హాజరై ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడికి లభించిన అత్యంత విలువైన హక్కు ఓటు హక్కు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో మన అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి ఓటు శక్తివంతమైన సాధనమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు అశ్వరావుపేట, ఇల్లందు మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, భద్రతా ఏర్పాట్లు, అవసరమైన సిబ్బంది నియామకం వంటి అన్ని సౌకర్యాలు కల్పించామని వివరించారు. వృద్ధులు, వికలాంగులు, ప్రత్యేక అవసరాలు ఉన్న ఓటర్ల కోసం వీల్‌చైర్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు వేయాలని కలెక్టర్ సూచించారు.


