పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
కాకతీయ, కల్లూరు : జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బుధవారం జరిగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరును పరిశీలించిన కలెక్టర్, పోలింగ్ సిబ్బందితో మాట్లాడి బ్యాలెట్ బాక్సుల నిర్వహణ, పీవో డైరీ నమోదు, ఫార్ముల నింపడం, సీలింగ్ ప్రక్రియపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలకు సమయానికి చేరుకుని నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, మైక్రో అబ్జర్వర్లను నియమించామని కలెక్టర్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


