డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్
ఎన్నికల ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని ఆదేశం
కాకతీయ, చేర్యాల : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చేర్యాలలో ఏర్పాటైన పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హైమావతి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను ఆమె పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ఈ నెల 10న పోలింగ్ మెటీరియల్ పంపిణీ సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. 11న పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి టిఫిన్, భోజనం, స్నాక్స్ వంటి వసతులు తప్పనిసరిగా కల్పించాలన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచాలని స్పష్టం చేశారు. 13న కౌంటింగ్ జరగనున్నందున 12న పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని, ఏజెంట్లకు పరిమిత పాస్‌లు ఇవ్వాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం వెబ్ కెమెరాల్లో రికార్డు కావాలని, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ నాగేందర్‌కు ఆదేశాలు జారీ చేశారు.


