చలి పంజా
రాష్ట్రంలో రెండు రోజులుగా పొడి వాతావరణం
పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు
సింగిల్ డిజిట్‌కు పడిన ఉష్ణోగ్రతలు
జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు వైద్యుల హెచ్చరిక
కాకతీయ, హైదరాబాద్ : రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో పొడి వాతావరణం కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. చలి తీవ్రత నేపథ్యంలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, వికారాబాద్, జగిత్యాల, నిజామాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్ధిపేట, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
రహదారులపై పొగమంచు
చలి తీవ్రత పెరగడంతో ఉదయం వేళ రోజువారీ పనుల కోసం బయటకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్కుల్లో వాకింగ్ చేసే వారు స్వెటర్లు, మంకీ క్యాప్‌లతో దర్శనమిస్తున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
రాష్ట్రంలో సోమవారం అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 6.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 8.8, పటాన్‌చెరువులో 8.4, హైదరాబాద్‌లో 13 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.


