రేషనలైజేషన్ ముసుగులో ప్రభుత్వ పాఠశాలల మూసివేత
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : రేషనలైజేషన్ పేరుతో తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను క్రమంగా మూసివేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ ఆరోపించారు. శనివారం సిద్ధార్థ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ విద్యారంగానికి నిధులు తగ్గిస్తూ, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా, మౌలిక వసతులు పట్టించుకోకపోవడం వల్ల ప్రభుత్వ విద్య ప్రజలకు దూరమవుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం ద్వారా విద్యను కాషాయీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, సమానమైన నాణ్యమైన విద్య కోసం ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశం అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు.


