పోలింగ్ కేంద్రంలో నిశితంగా గమనించాలి
జీపీ ఎన్నికల్లో పరిశీలకుల పాత్ర అత్యంత కీలకం
ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి శ్రీరామ్
కాకతీయ, కొత్తగూడెం : పోలింగ్ కేంద్రంలో జరిగే ప్రతి అంశాన్ని నిశితంగా గమనించాలని ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి శ్రీరామ్ సిబ్బందికి సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల సూక్ష్మ పరిశీలకుల (మైక్రో అబ్జర్వర్ల) శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మూడు విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. పోలింగ్‌కు ఒక రోజు ముందుగానే మైక్రో అబ్జర్వర్లు తమ తమ పోలింగ్ స్టేషన్లకు చేరుకుని ఏర్పాట్లను పరిశీలించాలని సూచించారు. పోలింగ్ ప్రారంభానికి ముందు పోలింగ్ సమయంలో పోలింగ్ ముగిసిన తరువాత ప్రతి దశలోనూ సూక్ష్మంగా పరిశీలించి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రంలో జరిగే ప్రతి అంశాన్ని నిశితంగా గమనించి ఎన్నికల నియమావళి ఖచ్చితంగా అమలవుతున్నదేనా అనే విషయాన్ని అంచనా వేసి తగిన నివేదికను సాధారణ పరిశీలకులకు సమర్పించాలని ఆదేశించారు. ఎలాంటి అనుచిత చర్యలు నిబంధనల ఉల్లంఘనలు గమనించిన వెంటనే సాధారణ పరిశీలకుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి సాయి కృష్ణ, లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి, మైక్రో అబ్జర్వర్లు తదితరులు పాల్గొన్నారు.


