వేములవాడ చైర్మన్ పదవీకాలంపై స్పష్టత ఇవ్వాలి
ఫిబ్రవరి సమావేశం ఎందుకు నిర్వహించలేదు
‘చెరో రెండున్నర ఏళ్లు’ అంశంపై వెంటనే క్లారిటీ ఇవ్వాలి
బీఆర్ఎస్ కౌన్సిలర్ల డిమాండ్
కాకతీయ, రుద్రంగి : వేములవాడ మున్సిపల్ పాలకవర్గంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలు అభివృద్ధి కోసం గెలిపిస్తే, వారి నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఫిబ్రవరి నెల మున్సిపల్ సమావేశం ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఒక్క సమావేశం కూడా సక్రమంగా నిర్వహించలేదని విమర్శించారు. వార్డుల్లో నీరు, డ్రైనేజీ, రహదారులు వంటి సమస్యలు పేరుకుపోతున్నా చర్చించి పరిష్కరించే ప్రయత్నం కనిపించడం లేదని మండిపడ్డారు. అభివృద్ధి కంటే మీడియా ప్రచారంపైనే ఎక్కువ దృష్టి పెట్టుతున్నారని ఆరోపించారు.
పదవీకాలంపై స్పష్టత కోరుతూ డిమాండ్
మున్సిపల్ చైర్మన్ పదవీకాలాన్ని ‘చెరో రెండున్నర ఏళ్లు’గా పంచుకుంటారనే ప్రచారంపై వెంటనే ప్రజలకు స్పష్టత ఇవ్వాలని బిఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. పట్టణ అభివృద్ధి పనులపై పాలకవర్గం స్పష్టమైన కార్యాచరణ చూపాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు రామతీర్థపు మాధవి రాజు, వాసాల లావణ్యతో పాటు సీనియర్ నాయకులు నిమ్మశెట్టి విజయ్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, మారం కుమార్, కొండ కనుకయ్య, సలీమ్, కందుల క్రాంతి కుమార్, జోగిని శంకర్, గూడూరు మధు తదితరులు పాల్గొన్నారు.


