కార్మికుల సమ్మెకు మద్దతుగా సీఐటీయూ ర్యాలీ
కాకతీయ, బోనకల్ : దేశవ్యాప్త కార్మిక సమ్మెలో భాగంగా బోనకల్ మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఖమ్మం సెంటర్ వరకు కొనసాగింది. కార్మిక సంఘాలు, కూలి సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, వ్యవసాయ కూలీలకు నష్టం కలిగించే చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నూతన విద్యుత్ సవరణ చట్టం వల్ల రైతులు, పేద వర్గాలపై పెనుభారం పడుతుందని, అందుకే దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
కార్మిక హక్కులను హరించే విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతోందని, కార్మిక వర్గాల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవాలని వారు కోరారు.
ఈ ర్యాలీలో సీఐటీయూ నాయకులు, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, కూలి సంఘాల సభ్యులు, మహిళా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


