పల్లెల్లో ప్రచార పోరుకు రేపటితో బ్రేక్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పల్లెల్లో రోజులు తరబడి కొనసాగుతున్న రాజకీయ ప్రచార పోరుకు రేపటితో తెరపడనుంది. అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు ఇంటింటి ప్రచారం, బహిరంగ సభలు, ర్యాలీలు, మైక్ ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలను వేగవంతం చేశారు. గ్రామాల వీధుల్లో జెండాలు, బ్యానర్లు, గోడరాతలు, ప్రచార వాహనాలతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఎన్నికల నిబంధనల ప్రకారం రేపటి సాయంత్రంతో ప్రచారానికి గడువు ముగియనుండటంతో, ఆ తర్వాత మౌనప్రచార కాలం ప్రారంభం కానుంది. ఈ సమయంలో ఓటర్లను ప్రత్యక్షంగా కలిసే ప్రచారం, మైక్ వినియోగం, బహిరంగ సమావేశాలు నిషేధించబడతాయి. అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, నియమావళిని కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రచారానికి బ్రేక్ పడుతున్న నేపథ్యంలో గ్రామాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలంతా సహకరించాలని ఎన్నికల అధికారులు పిలుపునిచ్చారు. ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.


