బస్సు షెల్టర్ లేక అవస్థలు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : మధిర పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద బస్సు షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మధిరకు ప్రధాన కూడలిగా ఉన్న ఈ ప్రాంతం విజయవాడ,నందిగామ, మీనవోలు ఎర్రుపాలెం, తదితర ప్రాంతాలకు ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణిస్తుంటారు. అయితే, బస్సు కోసం ఎదురుచూసే సమయంలో కనీసం నిలబడేందుకు నీడ లేక రోడ్డుపైనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండాకాలంలో మండుతున్న ఎండకు తట్టుకోలేక, వర్షాకాలంలో తడిచిపోతూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, విద్యార్థులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని స్థానికులు తెలిపారు. కొందరు ప్రయాణికులు రోడ్డు పక్కన నిలబడి బస్సు కోసం ఎదురుచూడాల్సి రావడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ సెంటర్ చుట్టుపక్కల వ్యాపార సముదాయాలు, కార్యాలయాలు, జనసంచారం ఎక్కువగా ఉన్నప్పటికీ బస్సు షెల్టర్ ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రజలు విమర్శిస్తున్నారు. గతంలో పలుమార్లు మున్సిపల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేసినా ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. కనీస సదుపాయాలైన సీటింగ్, నీడ, లైటింగ్‌తో కూడిన బస్సు షెల్టర్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటేనే ప్రయాణికుల ఇబ్బందులు తీరుతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


