ఫ్రస్టేషన్‌లో బీఆర్ఎస్ నేతలు
వారి మాటలు వింటుంటే జాలేస్తోంది
అద్దం లాంటి రోడ్లు వేస్తామంటే గుండెలు అదురుతున్నాయి
అన్నిట్లోస్కాం లు చేసిన మీకు ఏది చూసిన స్కామే కన్పిస్తోంది
మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాటలు విన్నాకా ఇంత అజ్ఞానుడా అనిపించింది
సీఆర్ఐఎఫ్ రోడ్లకు.. హ్యామ్ రోడ్ల విధానికి చాలా తేడా
కళ్ళద్దాలు పెట్టుకొని కూడా..0.4% ను 4% అని చదివావంటే నీ ఆరోగ్యం పై నాకు ఆందోళనగా ఉంది
ఈ విషయం తెలియకుండానే ఆర్ అండ్ బీ శాఖ మంత్రిగా పనిచేశారు
ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సెటైర్లు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపించిన చందాన.. పేదళ్లు అనేక పథకాల్లో స్కాములు చేసినా బీఆర్ ఎస్ నేతలకు ఇప్పుడు మేం ఏ అభివృద్ధి పని చేసినా అందులో స్కాంలంటూ ప్రచారం చేస్తున్నారని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైటర్లు వేశారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. హ్యామ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే రోడ్లలో 8వేల కోట్ల స్కాం జరుగుతుందని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రశాంత్ రెడ్డి ఆరోపణలపై మంత్రి తన దైన శైలిలో సమాధానమిచ్చారు. ఇటీవల బీఆర్ఎస్ నేతల ప్రెస్టేషన్ మాటలు వింటుంటే జాలేస్తోందన్నారు. గతంలో రోడ్లు వేయాలంటే వారికి మనసు రాలేదు.. . ఇప్పుడు అద్దం లాంటి రోడ్లు వేస్తామంటే బీఆర్ఎస్ నేతల గుండెలు అదురుతున్నాయని అన్నారు. కాళేశ్వరం స్కాం, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం స్కాం, ధరణి స్కాం, గొర్రెల స్కాం ఇలా చెప్పుకుంటూ పోతే పదేళ్ల కాలంలో మీరు చేసిన స్కాంలకు అంతే లేదని మండిపడ్డారు. కవిత వేరే కుంపటి పెట్టుకుంది..ఇవాళ్టి నుంచి జనాల్లోకి అంటూ వెళ్తున్నది..మరోవైపు హరీష్ రావు కొత్త పార్టీ కోసం చూస్తున్నట్లు తెలుస్తోందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుండడం..ఆ పార్టీ నేతలు చెట్టుకొకరు, పుట్టకొక్కరు అవడం చూసి చోటా..మోటా బీఆర్ఎస్ నేతలు అయోమయంలో పడి.. ఆగం ఆగం అవుతున్నారనీ విమర్శించారు.
ప్రశాంత్ రెడ్డి ఇంత అజ్ఞానుడు అనుకోలేదు..!
“మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడే..కానీ ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే ఇంత అజ్ఞానా..? అని విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. సీఆర్ఐఎఫ్ రోడ్లకు.. హ్యామ్ రోడ్ల విధానికి చాలా తేడా ఉంటుంది. ఆర్ అండ్ బీ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయనకు ఇది తెలియకపోవడం బాధాకరమన్నారు. సీఆర్ఐఎఫ్ లో కి. మీ1.75 కోట్లు అవుతుందన్నది సింపుల్ వైడెనింగ్ కోసం మాత్రమే, అదే హ్యామ్ మోడల్ లో చేస్తున్నది డబుల్ లేన్ బలోపేతం అది కూడా ఎన్ హెచ్ ఏఐ నార్మ్స్ ప్రకారం చేస్తున్నామని తెలిపారు. కి.మీ రోడ్డు మెయింటెనెన్స్ కోసం రూ.2కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నారని, కి.మీ రోడ్డు కోసం రూ.6 కోట్లు అవుతుందని అసత్యాలు మాట్లాడాడని, నిజానికి 15 సంవత్సరాల్లో ఒక్క కి.మీ మెయింటెనెన్స్ కోసం ఖర్చు చేసేది కేవలం 20లక్షల లోపే..మొత్తం ఒక్క కి.మీ మీద మొత్తం కాలానికి 2కోట్ల90లక్షలు మాత్రమే అవుతుందని వివరించారు. “కళ్ళద్దాలు పెట్టుకొని కూడా..0.4% ను 4% అని చదివావంటే నీ ఆరోగ్యం పై నాకు ఆందోళన కలుగుతుంది మిత్రమా” అని మంత్రి తన స్టైల్ సెటైర్ వేశారు.
“చింత చచ్చినా..పులుపు చావలేదన్నట్లు
మెయింటెనెన్స్ కోసం మొదటి సంవత్సరం ప్రభుత్వం ఏమి ఖర్చు చేయదనీ..రెండో సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు 0.4% మాత్రమే చేస్తుందని మంత్రి తెలిపారు. 6వ సంవత్సరంలో 0.8%,7వ సంవత్సరంలో రోడ్ రెన్యువల్ కు 2.4%, తర్వాత 8 నుంచి 12 సంవత్సరాల వరకు 0.4% శాతం,13 నుండి 0.8%శాతం అని ఇలా మొత్తం 15 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ కోసం అయ్యే ఖర్చు కేవలం 20 లక్షల లోపే అని మంత్రి స్పష్టం చేశారు. “నేను 6 సార్లు ప్రజల ఆశీర్వాదంతో చట్టసభలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధిని..ఈ సుదీర్ఘ రాజకీయ జీవితంలో చిన్న మచ్చ(ఆరోపణ) కూడా నాపై లేదు.నేను అవినీతిని ప్రోత్సహించే వ్యక్తిని కాదు..అవినీతి జరిగితే చూస్తూ ఊరుకోను. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి,ఆమరణ దీక్షతో ప్రాణ త్యాగానికి సిద్ధ పడ్డోడిని…నా చివరి శ్వాస వరకు తెలంగాణ ప్రజల మేలు కోసమే పనిచేస్తానని తెలిపారు. “చింత చచ్చినా..పులుపు చావలేదన్నట్లు..” తెలంగాణ ప్రజలు మీ అహంకారాన్ని ఇంకా గమనిస్తున్నారు అంటూ బిఆర్ఎస్ కు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.


