కాకతీయ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. పాత వీడియోలను మళ్లీ మళ్లీ షేర్ చేస్తూ తనపై అబద్ధపు ప్రచారం చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ముందుకు రావడానికి, గతంలో హరీష్ రావుపై కొన్ని విమర్శలు చేసినప్పటికీ, అవి వాస్తవం కాదని, అప్పుడే తన తప్పు ఒప్పుకున్నానని ఆయన స్పష్టంగా తెలిపారు.
వంటేరు మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ అంశంలో నేను తప్పు మాట్లాడాను. ఆ సమయంలో నేను కాంగ్రెస్ పార్టీకి చెందినవాణ్ని. ఆ సమయంలో చేసిన విమర్శలు పూర్తిగా అవాస్తవం. హరీష్ రావు తీసుకున్న నిర్ణయాలు సరైనవే, కానీ నేను చేసిన వ్యాఖ్యలు తప్పు అని అప్పట్లోనే ఒప్పుకున్నాను అని పేర్కొన్నారు.
అయితే ఇప్పుడు కొందరు వ్యక్తులు ఆ పాత వీడియోలను తిరిగి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ, తప్పుడు వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని వంటేరు ఆరోపించారు. అలాంటి వారిని చెప్పులతో సన్మానం చేయాల్సిందే అంటూ తీవ్ర హెచ్చరిక కూడా చేశారు.
ఇకపై ఇలాంటి వక్రీకరించిన ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రాజకీయ లాభాల కోసం పాత విషయాలను వక్రీకరించి ప్రజలను తప్పుదారి పట్టించడం తగదని వంటేరు స్పష్టం చేశారు.


