బీఆర్ఎస్ అభివృద్ధే విజయానికి గ్యారంటీ
18వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి పెడకంటి రామకృష్ణ
కాకతీయ, కల్లూరు : పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయానికి బాట వేస్తుందని 18వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి పెడకంటి రామకృష్ణ (కృష్ణయ్య) అన్నారు. శుక్రవారం శాంతినగర్ ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నాయకత్వంలో కల్లూరులో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. నూతన ఆసుపత్రి, మినీ స్టేడియం, ఆధునిక బస్ స్టాండ్, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు బీఆర్ఎస్ పాలనకు నిదర్శనమన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పనులు శూన్యమని విమర్శించారు. ఫిబ్రవరి 11న జరిగే ఎన్నికల్లో సీపీఎం మద్దతుతో పోటీలో ఉన్న తనను కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. శాంతినగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.


