ఖమ్మంలో మళ్లీ భాయ్‌లు..
రౌడీషీట్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసెదెవరు..?
సెటిల్‌మెంట్లు..భూ కబ్జాలే లక్ష్యం
యువతకు గంజాయి, మద్యం ఎర
మూడో పట్టణంలో ఎక్కువగా రౌడీయిజం
రాజకీయ అండతో మళ్లీ పుంజుకుంటున్న వైనం
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరంలో భాయ్‌లుగా పిలుచుకునే రౌడీషీట్లర్ల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మూడో పట్టణ ప్రాంతంలో వీరి దౌర్జన్యాలు ఎక్కువగా కొనసాగుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఓ మాజీ మంత్రి అండతో వీరు బహిరంగంగా సెటిల్‌మెంట్లు, భూ కబ్జాలు, కాలనీల్లో బెదిరింపులకు పాల్పడ్డారని సమాచారం. ఈ బ్యాచ్‌లను పెంచిపోషించిన ద్వితీయ క్యాడర్ నాయకులు గంజాయి, మద్యం బాటిళ్లను ఎరగా వేస్తూ తమ అధికారాన్ని చాటుకున్నారని తెలుస్తోంది. వ్యాపారులు, రియల్టర్లను బెదిరించి ఆర్థిక లాభాలు పొందడమే లక్ష్యంగా ఈ గ్యాంగ్‌లను ఉపయోగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుటుంబ విభేదాలతో దారి తప్పిన యువకులను కూడా ఈ గ్యాంగ్‌ల్లో చేర్చుకుని నేరాలకు అలవాటు చేస్తున్నారని చెబుతున్నారు.
రౌడీయిజానికి రాజకీయ రక్షణ
మత్తుకు బానిసైన వీరు సొంత కుటుంబ సభ్యులపైనా దాడులకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో మాజీ మంత్రి పర్యటనలు, హైకమాండ్ నేతలు, ముఖ్యమంత్రుల సభల సమయంలో బల ప్రదర్శనకు ఈ గ్యాంగ్‌ను వినియోగించారని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో అమలైన ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానం కూడా ఇలాంటి శక్తులకు కలిసొచ్చిందనే విమర్శలున్నాయి. ప్రభుత్వం మారి కాంగ్రెస్ పాలన వచ్చాక కొంతకాలం రౌడీయిజం తగ్గినట్టు కనిపించినా, పైకి శాంతిగా ఉన్నా లోపల మాత్రం అదే దందా కొనసాగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అదే కోవకు చెందిన కొందరు కాంగ్రెస్ పక్షాన చేరి రాజకీయంగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై పోలీస్ యంత్రాంగం కఠినంగా స్పందించాలన్న డిమాండ్ ఖమ్మం నగరంలో బలంగా వినిపిస్తోంది.


